: వార్నర్ అవుట్ అయినా కాదన్న అంపైర్ అనిల్ చౌదరి... నెట్టింట క్రీడాభిమానుల తిట్లు!

నిన్న కాన్పూర్ లో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అవుట్ అయినప్పటికీ, ఇవ్వని అంపైర్ అనిల్ చౌదరిపై సామాజిక మాధ్యమాల్లో క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. గుజరాత్ లయన్స్ చేసిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇబ్బందుల్లో పడిన జట్టును వార్నర్ ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆట 10వ ఓవర్ లో అంకిత్ సోనీ వేసిన ఓ బాల్ వార్నర్ బ్యాట్ కు తగిలి, ఆపై కీపర్ చేతుల్లోకి వెళ్లింది. లయన్స్ కెప్టెన్ రైనా, కీపర్ దినేష్ కార్తీక్ లతో పాటు సోనీ సైతం అవుట్ ను క్లయిమ్ చేయగా, అంపైర్ మాత్రం తల అడ్డంగా ఊపాడు.

దాంతో దినేష్ కార్తీక్ తీవ్ర ఆగ్రహంతో బాల్ ను నేలకేసి కొట్టాడు. ఆపై రీ ప్లేలో ఆ బంతి బ్యాట్ ను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. ఇక, ఇదో కాస్ట్లీ అంపైరింగ్ తప్పని, ఈ సీజన్ లో వార్నర్ మరోసారి అంపైర్ల తప్పు కారణంగా బతికిపోయాడని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అనిల్ చౌదరికి ఇవ్వాలని, హైదరాబాద్ జట్టును గెలిపించేందుకు అనిల్ కంకణం కట్టుకున్నట్టు ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి అనిల్ చౌదరి గల్లీ క్రికెట్ అంపైరింగ్ చేశాడని, ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక తప్పు చేసే అనిల్ ను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తూ, మైదానంలో కూర్చున్న ప్రేక్షకులకు వినిపించిన బ్యాట్ సౌండ్, అంఫైరింగ్ చేస్తున్న అనిల్ కు వినిపించలేదని విమర్శిస్తున్నారు.


More Telugu News