: భర్త వాదనను తోసిపుచ్చి...భరణంగా 3,700 కోట్లు చెల్లించమన్న న్యాయమూర్తి

రష్యాకు చెందిన భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో లండన్ లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం భార్యకు 584 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని భర్తను ఆదేశించింది. రష్యా భార్యభర్తలు లండన్ న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారన్న అనుమానం వచ్చిందా?... మరి దాని వివరాల్లోకి వెళ్తే... రష్యాకు చెందిన ఈ బిలియనీర్ దంపతులకు 1989లో తొలిసారి మాస్కోలో పరిచయమైంది. నాలుగేళ్ల ప్రేమ తరువాత 1993లో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది వారిద్దరూ లండన్ లోని సర్రే ప్రాంతంలో స్థిరపడ్డారు.

ఇన్నేళ్ల దాంపత్యం తరువాత వారి మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో వారిద్దరు బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయమూర్తి హాడన్ కేవ్ వారికి విడాకులు మంజూరు చేస్తూ... భరణం కింద మహిళకు 584 మిలియన్‌ డాలర్లు (3,700 కోట్ల రూపాయలు) ఇవ్వాలని భర్తను ఆదేశించారు. ఈ మొత్తం ఆ దంపతుల ఆస్తిలో 41.5 శాతానికి సమానమని, సంపాదనలో తన భాగమే ఎక్కువని భర్త వాదించగా, కుటుంబ సంపదలో భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కు ఉంటుందని, ఆదేశించిన మొత్తం చెల్లించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, వారి వివరాలు వెల్లడించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.

More Telugu News