: భారత వ్యాపారిని కలవడంపై పాక్ సైన్యానికి వివరణ ఇచ్చిన నవాజ్ షరీఫ్

భారత ఉక్కు దిగ్గజం సజ్జన్ జిందాల్ ను కలవడంపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యానికి వివరణ ఇచ్చారు. ముర్రీలోని హిల్ రిసార్టులో ఏప్రిల్ 27న జిందాల్ ను కలవడం వెనుక ద్వైపాక్షిక కారణాలు మాత్రమే ఉన్నాయని పాక్ ఆర్మీ చీఫ్ ఒమర్ జావేద్ బజ్వాకు షరీఫ్ చెప్పినట్టు బీబీసీ ఉర్దూ ఓ వార్తను ప్రసారం చేసింది. దాదాపు గంటపాటు తామిద్దరి మధ్యా చర్చలు సాగగా, ఇరు దేశాల మధ్యా ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించే దిశగా మాటలు సాగినట్టు సైనికాధికారులకు నవాజ్ స్పష్టం చేశారని పేర్కొంది.

కాగా, సీమాంతర ఉగ్రవాదం, కులభూషణ్ యాదవ్ కు పాక్ సైనిక కోర్టు మరణదండన, కాశ్మీర్ లో అధ్వానంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల నడుమా అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింతగా దిగజారిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, జూన్ 8 నుంచి కజకిస్థాన్ లోని అస్తానాలో జరిగే ఎస్సీఓ సదస్సులో షరీఫ్, మోదీ కలసి మాట్లాడుకునేలా చూసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు పాక్ విదేశీ వ్యవహారాల శాఖ సలహాదారు అజీజ్ వెల్లడించారు.

More Telugu News