: పాకిస్థాన్ లోని భారత ఎంబసీలో ఢిల్లీ యువతి... భర్త మోసం చేయడం వల్లే ఆశ్రయం కోరానన్న యువతి!

వీసా కోసం భారత్ ఎంబసీలోకి వెళ్లిన తన భార్యను భారత హైకమిషన్‌ అధికారులు నిర్బంధించారంటూ ఇస్లామాబాద్ పోలీసులకు తాహిర్‌ అలీ అనే పాకిస్తానీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణలో ఆసక్తికర మలుపులు చోటుచేసుకోగా, సదరు యువతి ఇస్లామాబాద్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం పాకిస్థాన్ లో పెను కలకలం రేపింది. మలేసియాలో పరిచయమైన అలీ, ఉజ్మాలు ఒకరికొకరు పరిచయమై ప్రేమలో పడ్డారు. వాఘా బోర్డర్ ద్వారా మే 1న పాకిస్థాన్ చేరుకున్న ఉజ్మా, మే 3న అలీని వివాహం చేసుకుంది. ఆ తరువాతే ఆమెకు అసలు విషయం తెలిసింది. అలీకి ఇంతకు ముందే వివాహమై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. ఈ విషయం అలీ దాచి పెట్టాడని ఆరోపించింది.

తాను అతనితో వివాహానికి నిరాకరించగా, అలీ తన తలకు తుపాకీ గురిపెట్టి వివాహమాడాడని ఉజ్మా (20) మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. అంతే కాకుండా దేశం విడిచి వెళ్లకుండా తన ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లను కూడా లాక్కున్నాడని వెల్లడించింది. అందుకే వీసా రెన్యువల్ పేరుతో ఇండియన్ ఎంబసీలోకి వచ్చి, ఆశ్రయం కోరానని తెలిపింది. మరోవైపు ఉజ్మా కేవలం విజిటింగ్‌ వీసాలతోనే తమ దేశంలోకి అడుగుపెట్టిందని పాక్‌ వర్గాలు తెలిపాయి. ఆమెకు న్యాయసహాయం అందించడంతో పాటు ఈ విషయమై పాక్‌ విదేశాంగ కార్యాలయం, ఉజ్మా కుటుంబంతో చర్చిస్తున్నట్లు భారత్‌ తెలిపింది.

More Telugu News