: ఇంగ్లిష్ రాకపోవడంతో... అనవసరంగా 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన మహిళ

చిన్న తప్పిదంతో ఒక ఫ్రెంచ్ మహిళ సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... లూసీ బహెతౌకిలాయె అనే ఫ్రెంచ్ మహిళకు ఇంగ్లిష్ మాట్లాడడం అస్సలు రాదు. ఏప్రిల్ 24న ఆమె న్యూయార్క్ నుంచి పారిస్ వెళ్లాల్సి ఉంది. ఆమె బోర్డింగ్ పాస్ పై ‘న్యూయార్క్ టు చార్లెస్ డి గాల్లె’ అని స్పష్టంగా పేర్కొని ఉంది. దీంతో విమాన ప్రతినిధులు ఆమె బోర్డింగ్ పాస్‌ పై స్టాంప్ వేసి పంపించారు.

ఆమె విమానమెక్కి తన సీటు 22-సి లో కూర్చున్నారు. విమానం బయల్దేరింది. సిబ్బంది కూడా ఆమెను పట్టించుకోలేదు. ఇక్కడే పొరపాటు జరిగిపోయింది. తను ఎక్కాల్సిన విమానానికి వెళ్లాల్సిన గేటుకి బదులు మరో గేటు ద్వారా ఆమె రావడంతో విమానం మారిపోయింది. మరో విమానం ఎక్కేసింది. విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఏమాత్రం గుర్తించలేదు.

అనంతరం ఆ విమానం శాన్ ఫ్రాన్సిస్కో (4,828 కిలోమీటర్లు) లో దిగింది. విమానాశ్రయం బయటకు వచ్చిన తరువాత ఆమె ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో తిరిగి ఎయిర్ పోర్టులోకి వెళ్లి యునైటెడ్ ఎయిర్‌ లైన్స్ అధికారులను నిలదీసింది. దీంతో విమాన సిబ్బంది డిపార్చర్ ప్రకటనను కనీసం ఫ్రెంచ్ భాషలో చేసి ఉన్నా తాను గుర్తించేదానినని, తనను అనవసరంగా గమ్యానికి దూరంగా తీసుకొచ్చారని మండిపడింది.

దీంతో దీనిని ఘోర తప్పిదంగా అభివర్ణించిన యూనైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఆమెకు అకామిడేషన్ ఛార్జీలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఆమెకు క్షమాపణలు చెప్పి, మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతామని తెలిపింది. అలా ఆ మహిళ 11 గంటలపాటు తిరిగిన కౌంటర్ కే తిరుగుతూ...నరకం అనుభవించి... చివరికి పారిస్ వెళ్లే విమానం ఎక్కింది.

More Telugu News