: సెంచరీ మిస్సైన ప్రత్యర్థి ఆటగాడిని ఓదార్చి... అభిమానుల మనసు దోచుకున్న సురేష్ రైనా

డిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఆటగాడు రిషబ్ పంత్ తో గుజరాత్‌ లయన్స్‌ సారథి సురేశ్‌ రైనా వ్యవహరించిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ లేని ఢిల్లీకి ఈ లక్ష్యం చాలా పెద్దదని, గుజరాత్ విజయం తధ్యమని అంతాభావించారు. భారత జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్, రిషబ్ పంత్ రెచ్చిపోవడంతో ఆ జట్టు కేవలం 17.3 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించింది.

ఈ క్రమంలో 19 ఏళ్ల రిషబ్ పంత్ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి భారీ షాట్లు ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న పంత్‌ (97) ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో థంపీ బౌలింగ్‌ లో కీపర్‌ దినేష్ కార్తీక్ కు క్యాచ్‌ ఇచ్చాడు. రిషబ్ అవుట్ కాగానే థంపీతో పాటు గుజరాత్‌ జట్టు సభ్యులంతా ఆనందంలో మునిగిపోగా, సెంచరీ మిస్సయ్యానన్న భావోద్వేగంతో రిషబ్ క్రీజులోనే బేలగా చూస్తుండిపోయాడు.

దీంతో సురేశ్ రైనా సెంచరీ మిస్సైన రిషబ్ వద్దకు వెళ్లి 'బాగా ఆడావు... ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, సెంచరీ చేస్తావు' అంటూ ఓదార్చాడు. సాధారణంగా ప్రత్యర్థి జట్టులో రాణిస్తున్న ఆటగాడు అవుటైతే సంబరాలు చేసుకునే క్రికెట్ లో రైనా అలా అభినందించండంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రైనా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కీర్తిస్తున్నారు.

More Telugu News