: 20 వేల వైఫై హాట్ స్పాట్స్ కోసం చేతులు కలిపిన ఫేస్ బుక్, ఎయిర్ టెల్

గత సంవత్సరం ఫ్రీ బేసిక్స్ అంటూ 'ఇంటర్నెట్ డాట్ ఓఆర్జీ'ని విడుదల చేసి తీవ్రమైన చర్చకు తెరలేపి, ఆపై వెనక్కు తగ్గిన ఫేస్ బుక్, ఇప్పుడు 'ఎక్స్ ప్రెస్ వైఫై' పేరిట మరోసారి నెట్ వినియోగదారులను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 20 వేల హాట్ స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా భారతీ ఎయిర్ టెల్ తో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా జనావాసాల్లో నెట్ వర్క్ ఆధారిత ఐఎస్పీ రూటర్ లను ఫేస్ బుక్ ఏర్పాటు చేయనుంది.

ఇదే తరహా ఒప్పందాలను తాము రిలయన్స్ జియో, వోడాఫోన్ తో సైతం కుదుర్చుకోనున్నామని, త్వరలోనే డీల్స్ కుదురుతాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ తో కూడా పబ్లిక్ వైఫ్ హాట్ స్పాట్ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని తెలిపింది. అయితే, ఫ్రీ బేసిక్స్ మాదిరిగా, ఈ హాట్ స్పాట్ కేంద్రాల నుంచి డేటా సేవలు ఉచితంగా అందవు. దీన్ని పెయిడ్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని డైలీ, వీక్లీ, మంత్లీ డేటా ప్యాక్ లను కొనుగోలు చేసి వాడుకోవచ్చని తెలిపింది.

More Telugu News