: 9 నెలల జీతం తీసుకుని వెళ్లిపోండి: కాగ్నిజంట్ లో ఉన్నతోద్యోగులకు అల్టిమేటం

గత సంవత్సరంలో నికర లాభాలను 4.3 శాతం తక్కువగా నమోదు చేసి 1.55 బిలియన్ డాలర్లకు పరిమితమైన కాగ్నిజంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ లకు గట్టి పోటీ ఇస్తున్న విదేశీ సంస్థగా నిలిచిన కాగ్నిజంట్, ఇప్పుడు ఉన్నతోద్యోగులను సాగనంపేందుకు ప్రయత్నిస్తోంది. 6 నుంచి 9 నెలల వేతనాన్ని ప్రతిఫలంగా ఇస్తామని, దాన్ని తీసుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని పలువురికి తాఖీదులు ఇచ్చింది.

ఇండియాలో సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజంట్ కార్యాలయాల్లో పనిచేస్తుండగా, వీరిలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలోని ఉద్యోగులు సహా పలువురికి ఈ తాఖీదులు అందినట్టు తెలుస్తోంది. మేనేజ్ మెంట్ స్థాయిలో డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలోని వారికి స్వచ్ఛంద రాజీనామా అవకాశాన్ని కల్పించినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం ఎంతమందికి నోటీసులు ఇచ్చామన్న వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే, నోటీసులు ఇచ్చిన వారి శాతం అత్యంత స్వల్పమని, ఓ పారదర్శక విధానంలోనే వారికి అవమానం కలుగకుండా పంపించాలని నిర్ణయించామని తెలిపారు. కాగా, తాఖీదులు అందుకున్న వారందరూ తమ నిర్ణయాన్ని ఈ నెల 12లోగా తెలియజేయాలని కూడా కాగ్నిజంట్ యాజమాన్యం పేర్కొన్నట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News