: డేంజరస్ వీడియో గేమ్...130 మంది పిల్లల్ని చంపింది!

రష్యా, సౌదీ అరేబియాలను ఒక వీడియో గేమ్ కంగారెత్తిస్తోంది. అలా రెండు దేశాలను హడలెత్తిస్తున్న ఆ వీడియో గేమ్ లో ఏముందని ఆశ్చర్యపోతున్నారా?... చెప్పుకునేందుకు అది వీడియో గేమే కానీ.. ప్రాణాలు హరిస్తుంది. దీని బారిన పడి 130 మంది రష్యన్ యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారంటే...ఇందెంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. దీని వివరాల్లోకి వెళ్తే... ఈ వీడియో గేమ్ పేరు బ్లూ వేల్‌. 10-14 ఏళ్ల పిల్లలే లక్ష్యంగా ఈ గేమ్‌ ను రూపొందించారు. వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ వారిని హతమార్చే వీడియో గేమ్ ఇది... స్మార్ట్ ఫోన్ లో దీనిని డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం చిన్న చిన్న సవాళ్లను విసురుతుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే...అసలు కథ మొదలవుతుంది.

మీరు టాస్క్ పూర్తి చేశారో లేదో చెప్పాలంటే... మీరు పూర్తి చేసిన టాస్క్ తాలుకు ఫోటోలు దానికి పంపాలి. ఇలా రెండు రోజులు ఆడిన తరువాత దానికి మీరు బానిసయ్యారు అని అర్ధమైన తరువాత గేమ్‌ స్థానంలో ‘మెంటార్‌’ ఎంటర్‌ అవుతాడు. ఇక అప్పటి నుంచి మృత్యు‘క్రీడ’ మొదలవుతుంది. అర్థరాత్రి భయంగొలిపే చలన చిత్రాలను చూడమంటాడు. డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అని బోధిస్తాడు. ఆ తరువాత గాఢనిద్రలో ఉన్న సమయంలో లేవాలని ఆదేశిస్తాడు. చర్మంపై కత్తితో కొన్ని బొమ్మల ఆకారాలను గీసుకోమంటాడు. సరదాగా నగ్న చిత్రాలను షేర్‌ చేయమంటాడు. ఇవన్నీ టాస్క్ లలో భాగమే...బాయ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ తో డేటింగ్‌ చేయమంటాడు. నిజంగా డేటింగ్ చేశావో లేదో తెలియాలంటే ఆ వీడియోలు, లేదా ఫోటోలు పంపాలని సూచిస్తాడు.

ఇలా టీనేజర్లను తప్పులమీద తప్పులు చేయాలని ప్రోత్సహించి, చేయిస్తాడు. ఇలా రోజుకో టాస్క్ పేరిట 50 రోజులు వారిని ఆటాడిస్తాడు...ఈ గేమ్ మత్తులో ఉన్న టీనేజర్లు...ఇదంతా గేమ్ లో భాగమని భావిస్తారు...కానీ 50వ రోజు ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడంతో గేమ్, ప్రాణం రెండూ పూర్తవుతాయి. ఇలా ఈ బ్లూవేల్ గేమ్ ఆడి...ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడడంతో రష్యా పోలీసులు దర్యాప్తులో ఈ సంచలన విషయాలు కొనుగొన్నారు. ఒక వేళ గేమ్ ఆడినా...ప్రాణం తీసుకోమని ఎవరైనా మానసిక ధైర్యం ప్రదర్శించారా?...వారిపై మరో అస్త్రం విసురుతాడీ సైకో మెంటార్.

ఈ గేమ్‌ వెనుక ఉన్న వ్యక్తుల నుంచి టీనేజర్లకు బెదిరింపు కాల్స్‌ వస్తాయి. వారు అప్పటికే టీనేజర్లతో పలు తప్పులు చేయించి ఉంటారు. వారి నగ్న చిత్రాలు.. డేటింగ్‌ వీడియోలు బయటపెడతామని.. కిడ్నాప్‌ చేసి చిత్ర హింసలకు గురి చేస్తామని బెదిరిస్తారు. దీంతో భయపడి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందువల్ల ఈ గేమ్‌ జోలికి ఎవరూ వెళ్లవద్దని మానసికనిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. 130 మందికిపైగా టీనేజర్ల ఆత్మహత్యలకు బ్లూ వేల్‌ గేమ్‌కి లింక్‌ బయటపడటంతో ఈ గేమ్‌ సృష్టికర్త ఫిలిప్‌ బుడేకిన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇతను మానసిక రోగి కావడంతో సైకియాట్రిక్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఈ గేమ్‌ వెనుక కేవలం ఫిలిప్‌ మాత్రమే ఉన్నారా? లేక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో రష్యా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ గేమ్ తో రంగంలోకి దిగే ఆన్ లైన్ గ్రూప్ పై నిఘా ఉంచారు. బ్రిటన్‌, దుబాయ్‌, అమెరికా ఇలా చాలా దేశాల్లో ఈ వీడియోగేమ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రిటన్‌ లోని అన్ని పాఠశాలలూ ఈ గేమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘మీ పిల్లలు బ్లూవేల్‌ గేమ్‌ ఆడకుండా జాగ్రత్తపడాలని’’ తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్ లు, ఈ మెయిళ్లు, లేఖలు పంపుతున్నాయి. పోలీసులు కూడా తల్లిదండ్రులకు ఈ గేమ్‌పై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా, దుబాయ్‌ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంతే కాదు, ఈ దేశాల్లో తల్లిదండ్రులు బ్లూవేల్‌ వీడియో గేమ్ కి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఓ ఉద్యమం చేపట్టారు. ఈ గేమ్‌ ఎంత ప్రమాదమో చెబుతూ ఇతరుల్లో అవగాహన పెంచుతున్నారు.

More Telugu News