: భారీకాయురాలి సోదరి ఆరోపణలకు నిరసనగా రాజీనామా చేసిన వైద్యురాలు!

ప్రపంచంలోనే అత్యధిక బరువు (500 కేజీల) తో బాధపడుతున్న ఈజిప్టు మహిళ ఎమన్ అహ్మద్‌ కు తన సోదరి షైమా సలీమ్ చేసిన ఆరోపణలతో తలనొప్పి మొదలైంది. ముంబై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఎమన్ అహ్మద్ గత రెండు నెలల్లో సగానికిపైగా బరువు తగ్గారని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై షైమా సలీమ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. డాక్టర్లు చెబుతున్నదంతా అబద్ధమనీ.. తన సోదరి బరువు తగ్గలేదనీ.. పైగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం ఆమెను ఎమ్మారై రూంకి తీసుకెళ్లిన తరువాత వాస్తవాలు తెలుస్తాయని వైద్యులు కౌంటరిచ్చారు.

తాజాగా ఎమన్ అహ్మద్ కు చికిత్స చేస్తున్న మెడికల్ టీమ్‌ లో వైద్యురాలు డాక్టర్ అపర్ణ గోవిల్ భాస్కర్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. షైమా సలీమ్ ఆరోపణలపై ఆగ్రహంతో రాజీనామా చేసినట్టు ఆమె ఫేస్ బుక్ పేజ్ లో తెలిపారు. డాక్టర్లపై ఎలాంటి వేధింపులకు పాల్పడినా తాను సహించనని ఆమె తెలిపారు. అలాంటి వ్యక్తులను తిరస్కరించే హక్కు తనకు ఉందని ఆమె ఫేస్ బుక్ పోస్టులో తెలిపారు. దీంతో ఎమన్ అహ్మద్ చికిత్సకు ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. 

More Telugu News