: అమెరికన్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత: విప్రో కీలక ప్రకటన

ఇకపై అమెరికాలోని కార్యాలయాల్లో అమెరికన్లనే అధికంగా నియమించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఐటీ సేవల సంస్థ విప్రో ప్రకటించింది. హెచ్-1బీ వీసాలను కఠినం చేసిన నేపథ్యంలో ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ లు ఇదే విధమైన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం జూన్ త్రైమాసికం ముగిసేనాటికి, అమెరికాలో సగం ఉద్యోగులకన్నా అధికంగా స్థానికులే ఉండేట్టు చూసుకుంటామని తెలిపింది.

కస్టమర్ల సేవలను కొనసాగిస్తూ, స్థానికులను నియమించుకునేందుకు మరో రెండు డెలివరీ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో యూఎస్ లో ఇచ్చే కొత్త ఉద్యోగాల్లో 50 శాతం వరకూ అమెరికన్లకే ఇస్తామని పేర్కొంది. తమకు అతిపెద్ద మార్కెట్ అమెరికానేనని, ఆ దేశపు చట్టాలను, నిబంధనలను గౌరవిస్తామని విప్రో సిఇఓ నీముచ్ వాలా వెల్లడించారు. కొత్త డెలివరీ సెంటర్లు మిచిగాన్‌, కాలిఫోర్నియాలలో ఏర్పాటవుతాయని పేర్కొన్నారు.

More Telugu News