: కెప్టెన్ ఇన్నింగ్స్ తో గుజరాత్ ను విజయతీరాలకు చేర్చిన రైనా!

ఐపీఎల్ సీజన్ 10లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయిన గుజరాత్ లయన్స్ జట్టు ఎట్టకేలకు రెండో విజయం అందుకుంది. సీజన్ ఆరంభంలోనే రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైన గుజరాత్ లయన్స్ మూడో మ్యాచ్ లో విజయం సాధించింది. తరువాత మళ్లీ రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన కోల్ కతాతో మ్యాచ్ లో పోటీ ఇవ్వగలుగుతుందా? అన్న అనుమానాల మధ్య విజయం సాధించి సత్తాచాటింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయానికి చేరువచేసి రైనా ఆకట్టుకున్నాడు. దీంతో నిలకడలేమితో సతమతమవుతున్న గుజరాత్‌ లయన్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది.

తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా జట్టుకు రాబిన్‌ ఉతప్ప (72), సునీల్‌ నరైన్‌ (42) శుభారంభం ఇచ్చారు. గంభీర్ (33), మనీష్ పాండే (24), యూసుఫ్ పఠాన్ (11) ఆకట్టుకున్నారు. దీంతో కోల్‌ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 188 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌ లయన్స్ కు ఆరోన్ ఫించ్‌ (31), బ్రెండన్ మెక్‌ కల్లమ్‌ (33) శుభారంభం ఇవ్వగా, సురేష్ రైనా (84) కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు. చివర్లో రవీంద్ర జడేజా (19) ఒక చేయి వేయడంతో మరో పది బంతులు మిగిలి ఉండగానే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. దీంతో విజయాల బాటలో ఉన్న కోల్ కతాకు చెక్ చెప్పి, గుజరాత్ విజయం సాధించింది. 

More Telugu News