: మోదీకి ఎదురు నిలుద్దాం... కలసిరండి: సోనియాగాంధీకి నితీశ్ కుమార్ వినతి

త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి ఎదురు నిలిచేందుకు కలసి నడుద్దామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి జనతాదళ్ యునైటెడ్ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రతిపాదించారు. ఈ దిశగా విపక్షాలను ఏకం చేయడంలో సోనియా కలసి రావాలని ఆయన కోరారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ రాష్ట్రపతి అభ్యర్థికి పోటీగా విపక్షాలన్నీ కలసి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని మరొకరిని ఎంపిక చేద్దామని ఆయన సూచించారు.

ఢిల్లీలోని 10 జన్ పథ్ లోని సోనియా నివాసానికి వచ్చిన ఆయన, సోనియాతో చర్చలు జరిపారు. ఆయన వెళ్లిపోయిన అనంతరం మీడియాతో మాట్లాడిన జనతాదళ్ నేత కేసీ త్యాగి, రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకు సోనియా నేతృత్వం వహించాలని నితీశ్ కోరినట్టు తెలిపారు. బీహార్ లో విజయం సాధించిన మహాఘటబంధన్ ను జాతీయ స్థాయిలో తీసుకెళ్లి, 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అవకాశాలపైనా వీరు చర్చించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడటాన్ని తగ్గించి, తిరిగి అధికారం దిశగా, స్వీయ అజెండాను అమలు చేస్తూ ముందుకు సాగితే మంచిదని నితీశ్ కుమార్ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, జూలైతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండగా, జూలైలోనే రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సి వుంది.

More Telugu News