: డాక్టరంటే ఇలా ఉండాలి.. ఆన్‌లైన్‌లో వైరల్ అయిన చైనా వైద్యుడి ఫొటో!

వైద్యో నారాయణో హరి! అంటారు. మనుషుల ప్రాణాలను కాపాడే వైద్యుడు సాక్షాత్తూ నారాయణుడేనని దీని భావం. దీనికి నిలువెత్తు నిదర్శనం ఈ వైద్యుడంటూ చైనాకు చెందిన సర్జన్ లుయో హెంగ్ ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వైద్యుడు ఏం చేశాడంటే.. మార్చి 30న రాత్రి రెండు ఆపరేషన్లు పూర్తి చేసిన లుయో ఆ వెంటనే మరో మూడు సర్జరీలు చేయాల్సి వచ్చింది. అవి పూర్తయ్యాక మరోటి.. ఇలా ఏకంగా 28 గంటలపాటు నిద్ర లేకుండా నిర్విరామంగా ఐదుగురికి ఆపరేషన్లు చేశారు.

అప్పటికే నిద్ర ముంచుకొస్తున్నా.. రోగులకు తన అవసరం మళ్లీ ఉంటుందన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఓ మూల చాపపై పడుకున్నారు. వైద్యుడు లుయో అలసిపోయి ఆదమరిచి నిద్రిస్తున్న ఫొటోను చైనా గ్లోబల్ టీవీ నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి, ఆయన గురించి తెలిపింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు ముగ్ధులైపోయారు. వైద్యుడంటే ఇలా ఉండాలంటూ కితాబిచ్చారు. కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి వైద్యుడిని దేవుడుతో ఎందుకు పోలుస్తారో ఇప్పుడు అర్థమైందని కామెంట్లు చేశారు. ఇంకొందరు విధినిర్వహణలో పడి అన్నేసి గంటలు పనిచేయడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని అభినందన పూర్వకంగా హెచ్చరించారు. వైద్యుడి ఫొటోను వందలాదిమంది షేర్ చేశారు.

More Telugu News