: అందరూ యూఎస్ వీసాల గురించి ఆలోచిస్తున్న వేళ... ఇండియన్స్ కు షాకిచ్చిన సింగపూర్!

అమెరికా తీసుకువచ్చిన నూతన వీసా నిబంధనలు భారత ఐటీ ఉద్యోగులకు అడ్డంకులుగా మారుతున్నాయని బాధపడుతున్న వేళ, అదే బాటలో నడుస్తూ, సింగపూర్ కూడా షాకిచ్చింది. భారత ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తూ, జారీ చేయాల్సిన వీసాల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో సింగపూర్ వర్క్ వీసాలు పొందిన వారి సంఖ్య గణనీయంగా తగ్గించిందని, ఇది సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద నియమావళికి విఘాతమేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అమెరికాలో మాదిరిగానే, సింగపూర్ కూడా, స్థానిక నైపుణ్యాన్ని గుర్తించాలని, విదేశీ ఉద్యోగులను తీసుకురావడం ఆపి, ప్రతిభావంతులైన స్థానికులను నియమించుకోవాలని అక్కడి భారత కంపెనీలకు సింగపూర్ సర్కారు తాఖీదులిస్తోంది.

సింగపూర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజంట్, ఎల్ అండ్ టీ తదితర ఐటీ సంస్థలు ఎంతో మంది భారతీయులను అక్కడికి తీసుకువెళ్లి పనులు జరిపించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీసాల సమస్య గత సంవత్సరం నుంచే ప్రారంభమైందని, అన్ని భారత కంపెనీలకూ ప్రభుత్వం నుంచి వీసాల కోత, స్థానికులకు ఉద్యోగాల కల్పనపై నోటీసులు ఇచ్చాయని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ముఖ్యంగా సర్వీస్ ట్రేడ్ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్రతి దేశమూ స్థానికులకు మొదటి అవకాశం ఇవ్వాలంటూ కఠినమైన నిబంధనలు తెస్తున్నాయని అన్నారు. కాగా, వీసాల విషయంలో ఇటీవల విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ, హెచ్-1బీ వీసాలపై ఆందోళన అక్కర్లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

More Telugu News