: డిస్కౌంట్లా మజాకా... కిటకిటలాడుతున్న టూవీలర్ షోరూంలు... హాట్ కేక్ యాక్టివా!

భారత్ ఎమిషన్స్ -3 నిబంధనలను పాటించని వాహనాల విక్రయంపై ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమలు చేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, టూ వీలర్ కంపెనీలైన హీరో మోటో, హోండా, బజాజ్, సుజుకి తదితర కంపెనీలు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని డిస్కౌంట్లను ప్రకటించిన వేళ, షోరూములన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆఫర్లు నేటి వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని, అది కూడా స్టాక్స్ ముగిసేంత వరకూ మాత్రమేనని డీలర్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక హోండా యాక్టివా హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ఈ స్కూటర్ పై దాదాపు రూ. 12 వేల వరకూ తగ్గింపు ఉండటంతో యాక్టివా 3జీ వేరియంట్ ధర రూ. 50 వేలకు తగ్గడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు.

తమ వద్ద నిల్వ ఉన్న స్కూటర్ వేరియంట్లన్నిటినీ విక్రయించామని ఇప్పటికే పలు షోరూంల యాజమాన్యాలు ప్రకటించాయి. పర్యావరణ పన్నుగా రూ. 500 చెల్లించి బీఎస్ 3 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వీలున్నందునే ఇంతటి స్పందన వచ్చిందని అంటున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300కు పైగా వివిధ కంపెనీల డీలర్ షిప్ కేంద్రాలు ఉండగా, వీరివద్ద 27 వేల వరకూ వాహనాలు ఉన్నట్టు ఆర్టీయే అధికారులు భావిస్తున్నారు. వీటిపై రూ. 3 వేల నుంచి రూ. 20 వేల వరకూ తగ్గింపు ఉండటంతో బైక్ లు, స్కూటర్లన్నీ నేడు విక్రయించబడతాయని అంచనా.

More Telugu News