: అమేజాన్ ను వంచేందుకు విలీనం కావాలని ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ సంచలన నిర్ణయం!

ఇండియాలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా ఉన్న అమేజాన్ ను దెబ్బకొట్టేందుకు రెండు, మూడు స్థానాల్లో ఉన్న స్మాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ విలీనం కానున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆన్ లైన్ మార్కెట్ లో ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉండి, మార్కెట్ వాటాను నిలుపుకునేందుకు అమేజాన్ తో పోటీ పడుతున్న ఈ సంస్థలను కలిపేందుకు జపాన్ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సాఫ్ట్ బ్యాంక్ సారథ్యం వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇరు కంపెనీలతో చర్చలు జరిపిన బ్యాంకు, రెండు కంపెనీలూ ఒకటైతే బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,500) కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్టు కూడా తెలిపింది. ఆపై కొత్తగా ఏర్పడే సంస్థలో 15 శాతం, ప్రైమరీ, సెకండరీ షేర్లను కొనుగోలు చేస్తామని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

కాగా, స్నాప్ డీల్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లేదా అమేజాన్ లో విలీనం కావాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫ్లిప్ కార్టులో ఇన్వెస్ట్ చేసిన యూఎస్ హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్ తో స్నాప్ డీల్ కో-ఫౌండర్ కునాల్ బెహాల్ సమావేశం కూడా నిర్వహించినట్టు వార్తలు రాగా, ఇవి నిరాధారమని స్నాప్ డీల్ వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా, ఈ రెండు సంస్థలూ ఇటీవలి కాలంలో నిధుల సమీకరణకు నానా అవస్థలూ పడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి. విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. ఈ తాజా విలీన వార్తలపై ఇరు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది.

More Telugu News