: సునాయాసంగా టీమిండియా ఘన విజయం

ప్రతిష్ఠాత్మకమైన టెస్టు సిరీస్ లో ఇండియా సునాయాసంగా మరపురాని విజయాన్ని సాధించింది. ధర్మశాలలో జరుగుతున్న నాలుగో టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఇండియా 2-1 తేడాతో సిరీస్ ను గెలుచుకుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన ఇండియా, రెండో టెస్టును గెలుచుకుని సిరీస్ ను సమం చేయగా, మూడో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 300, రెండో ఇన్నింగ్స్ లో 137 పరుగులు చేయగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులు చేసింది.

ఆపై 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, మురళీ విజయ్, పుజారాల వికెట్లను కోల్పోయినప్పటికీ, రాహుల్, రహానే భారత జట్టును విజయ తీరాలకు చేర్చి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 76 బంతులాడిన రాహుల్ 9 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. గత ఏడు ఇన్నింగ్స్ లో రాహుల్ కిది ఆరో అర్ధ శతకం కావడం గమనార్హం. రహానే 27 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. దీంతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ వశమైంది.

More Telugu News