: వివాదం రేపిన మేగజీన్ కవర్ పేజీ ఫోటో!

కెనడా నుంచి వెలువడే పెళ్లి సంబంధాల పత్రిక ‘జోడీ’ కవర్‌ పేజీపై ప్రచురించిన ఫొటో భారత్ లో పెను వివాదానికి కారణమైంది. ఈ ఫోటో తమిళుల మనోభావాలను దెబ్బతీసిందని తమిళ సంఘాలు పేర్కొంటున్నాయి. ఓ తమిళ అమ్మాయి సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో పెళ్లి కూతురులా ముస్తాబైనట్లు ఉన్న ఆ ఫోటోలో కాళ్లు మాత్రం ఎటువంటి ఆచ్చాదన లేకుండా కనిపిస్తుంటాయి. చీరకట్టు అంటేనే ఒంటిని నిండా కప్పిపుచ్చుతుంది. అలాంటిది ఆ చీరకట్టును కూడా అశ్లీలం చేసి పడేసేలా పై నుంచి కింది వరకు చీలిక ఉండడంతో వివాదం రాజుకుంది. ఈ ఫోటోకు మోడల్ గా ‘తనుష్క సుబ్రమణియం’ నటించగా, దానికి కింద క్యాప్షన్ ‘విశాలంగా ఆలోచించు. మార్పును ఆహ్వానించు’ అని పెట్టారు.

దీంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఫోటో తమిళ సంస్కృతిని, సంప్రదాయాన్ని హేళన చేసినట్లుగా ఉందని కొంత మంది పేర్కొంటున్నారు. మరికొందరు ఈ ఫోటో ఆధునికతకు, మార్పుకు సూచికగా నిలుస్తోందని చెబుతూ ఇది స్త్రీవాదానికి ప్రతీకగా నిలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఒళ్లు కనిపించకుండా దుస్తులు ధరించడం, ధరించకపోవడం అవి ధరించేవారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, అదే సమయంలో ఓ సంస్కృతిని అవమానించినట్లు చూపడానికి తాము వ్యతిరేకమని ఇంకొందరు పేర్కొంటున్నారు. ఈ ఫోటోపై అభ్యంతరం తెలిపిన వారిని 'వెళ్లి ఆ చీరను సరిచేయండి' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ మేగజీన్ లో ప్రచురించిన ఫొటోపై చర్చ జరగడం సంతోషమని చెతున్న యాజమాన్యం, ఈ ఫొటోలో కళాకోణంతోపాటు ఫెమినిజం కూడా ఉందని చెబుతున్నారు.

More Telugu News