: మీ పద్ధతేం బాగోలేదు...: ప్రశ్నోత్తరాల వేళ మంత్రులు లేకపోవడంపై చైర్మన్ హమీద్ అన్సారీ మండిపాటు!

ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానాలు చెప్పేందుకు సంబంధిత మంత్రుల లేకపోవడంపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అసహనం వ్యక్తం చేశారు. సభా వ్యవహారాలు నడిచే ప్రక్రియ ఇది కాదంటూ అసహనం వ్యక్తం చేసిన అన్సారీ, మంత్రుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. పరిపాలన తీరు సరిగా లేదని విమర్శించారు. కాగా, యమునా వాటర్ టాక్సీ ప్రాజెక్ట్ సంబంధిత ప్రశ్నపై షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సి వచ్చింది.

అయితే, ఆ ప్రశ్న అడిగిన ఎంపీ, ఆ శాఖకు చెందిన మంత్రి కానీ సభలో లేరు. ఆ తర్వాత పర్యావరణ శాఖకు, విద్యుత్తు శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఆయా మంత్రులు లేరు. దీంతో, ప్రభుత్వం తీరును కాంగ్రెస్ పార్టీ ఎంపీ జైరాం రమేశ్ ప్రశ్నిస్తూ.. ‘సభలో ఒక్క కేబినెట్ మంత్రి కూడా లేరు’ అన్నారు. ఆ సమయంలో సహాయ మంత్రులు నిర్మలా సీతారామన్, రామ్ కృపాల్, సంజీవ్ కుమార్ బాల్యన్ మాత్రమే సభలో ఉండటం గమనార్హం.

More Telugu News