: భారత నిపుణులకు స్వాగతం పలుకుతున్న రష్యా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వినూత్నమైన వలస విధానాలను అమలు చేయడంతో ఆ దేశంలో స్థిరపడిన భారతీయ మేధావులు ఇబ్బందులకు గురవుతున్నారు. వీటికి తోడు జాత్యహంకార దాడులు కూడా చోటుచేసుకుంటుండడంతో అమెరికా సురక్షితమా? అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో భారతీయ వృత్తి నిపుణులకు స్వాగతం పలుకుతున్నామని రష్యా పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి డెనిస్‌ మాత్రోవ్‌ తెలిపారు. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక, వ్యాపార బంధానికి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఢిల్లీ వచ్చిన ఆయన మాట్లాడుతూ, భారతీయ వృత్తి నిపుణులు తమ దేశంలో సౌకర్యవంతంగా స్థిరపడటానికి అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు.

ప్రపంచంలో గణిత శాస్త్రాన్ని భారతీయులు, రష్యన్లు అత్యుత్తమంగా అధ్యయనం చేశారని ఆయన చెప్పారు. భారత వృత్తి నిపుణులు రష్యాలో స్థిరపడడం ఇరుదేశాలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, డెనిస్ మాత్రోవ్ ఆరు నెలల వ్యవధిలో భారత్‌ లో పర్యటించడం ఇది రెండోసారి. జూన్‌ 1 నుంచి 3 వరకు జరగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ కు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. 

More Telugu News