: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలు సాధించిన ఓట్లు, మెజారిటీల వివరాలు

గత వారంలో జరిగిన నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు చోట్లా వైకాపా అభ్యర్థులను తెలుగుదేశం అభ్యర్థులు ఓడించిన సంగతి తెలిసిందే. కడపలో వైకాపాకు షాక్ ను ఇస్తూ, తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 34 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 832 ఓట్లు పోల్ కాగా, తెలుగుదేశం అభ్యర్థికి 433, వైకాపాకు 398 ఓట్లు వచ్చాయని, మరో 8 ఓట్లు చెల్లలేదని తెలిపారు.

ఇక నెల్లూరు విషయానికి వస్తే, టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి, వైకాపా తరపున బరిలో నిలిచిన ఆనం విజయకుమార్ రెడ్డిపై 87 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ మొత్తం 851 ఓట్లు పోల్ కాగా, తెదేపాకు 465, వైకాపాకు 378 ఓట్లు వచ్చాయి. 7 ఓట్లు చెల్లలేదు. ఒక ఓట్ 'నోటా'కు పడిందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి తన సమీప ప్రత్యర్థి గౌరు వెంకటరెడ్డిపై 62 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 1077 ఓట్లు పోల్ కాగా, తెదేపాకు 564, వైకాపాకు 502 ఓట్లు వచ్చాయని, 11 ఓట్లు చెల్లలేదని, 1 ఓటు 'నోటా'కు పడిందని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News