: నిత్య యవ్వనం కోసం ఉపవాసం!.. తాజా పరిశోధనలో ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడి

ఉపవాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేకున్నా తాజా పరిశోధనలు మరోసారి చెప్పేలా చేస్తున్నాయి. ఉపవాసంలో ఉన్న గొప్పతనం, అది అందించే ఆరోగ్యం గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించారు. పెద్దలైతే ‘లంకణం .. పరమ ఔషధం’ అంటూ దాని విశేషాన్ని ఏనాడో చెప్పేశారు. అయితే తాజాగా శాస్త్రీయంగా కూడా ఉపవాసం వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయని రుజువైంది. అమెరికా యూనివర్సిటీ పరిశోధనకారులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ఉపవాసం మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో దోహదం చేస్తుందని తేలింది. నిత్యం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారికి ఉపవాసానికి మించిన మందు మరొకటి లేదని పేర్కొన్నారు. వయసుతో పాటు వచ్చే దుష్ప్రభావాలను ఇది నివారిస్తుందని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం ఎలుకలను ఎంచుకున్నారు. వీటికి కొన్ని రోజులు పాటు తక్కువ ఆహారాన్ని అందివ్వగా ఆ తర్వాత కొంతకాలం ఎక్కువ మొత్తంలో ఆహారం అందించారు. అనంతరం వాటిని పరిశీలించారు. తక్కువ ఆహారం తీసుకున్న ఎలుకలు బరువు తగ్గడమే కాకుండా అంతకుముందు కంటే ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉండడాన్ని గమనించారు. వీటి కణాల ఉత్పత్తిలోనూ మార్పు రావడాన్ని గుర్తించారు. ఇదే ప్రభావం మనుషుల మీద కూడా ఉంటుందని, ఉపవాసం లేదా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల మనుషుల్లో కూడా ఇదే విధమైన మార్పులు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇందుకోసం మరింత విస్తృతస్థాయి పరిశోధన కోసం వారు సిద్ధమవుతున్నారు.

More Telugu News