: ట్రంప్ దెబ్బకు కుదేలైన ఫ్లై ఎమిరేట్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం దెబ్బకు ప్రముఖ విమానయాన సంస్థ 'ఫ్లై ఎమిరేట్స్' కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ అనంతరం ఫ్లై ఎమిరేట్స్ కు బుకింగ్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 35 శాతం బుకింగ్స్ పడిపోయాయని ఫ్లై ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. దీనిపై ఈ సంస్థ అధ్యక్షుడు టిక్ క్లార్క్ మాట్లాడుతూ, ట్రావెల్ బ్యాన్ ప్రభావం తమ సంస్థపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.

కాగా, అత్యుత్తమ విమానయాన సంస్థల్లో ఒకటిగా ఫ్లై ఎమిరేట్స్ గుర్తింపు తెచ్చుకుంది. ముస్లిం దేశాల నుంచి అమెరికాకు ఫ్లై ఎమిరేట్స్ ఎక్కువ విమానాలు నడుపుతోంది. ట్రావెట్ బ్యాన్ నేపథ్యంలో ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. చాలా మంది తమ ప్రయాణాలు రద్దు చేసుకుని, యూరోప్ కు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లై ఎమిరేట్స్ కు ప్రయాణికుల కొరత ఏర్పడింది. మరోవైపు ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఎనిమిది రోజుల్లోనే అమెరికాకు వెళ్లే ప్రయాణికుల శాతం 6.5 శాతానికి తగ్గిందని ట్రావెల్ కన్సల్టెంట్ ఫార్వర్డ్ కీస్ రిపోర్టు వెల్లడించింది. 

More Telugu News