: రిలయన్స్, ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాల్లో 'బెస్ట్ అన్ లిమిటెడ్ రీచార్జ్' ప్లాన్ ఏదో తెలుసా?

జియో రాకతో టెలికాం ఆపరేటర్లలో పోటీ తత్వం పెరిగింది. దీంతో వినియోగదారులకు ప్రయోజనాలు అందుతున్నాయి. టెలికాం ఆపరేటర్లు ధరలు తగ్గిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. జియో ప్రకటించిన ఉచిత కాల్స్ ఆఫర్ మార్చి నెలాఖరుతో ముగియనుండడంతో టెలికాం ఆపరేటర్లంతా జియోకు దీటైన ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ప్రధానంగా రిలయన్స్, ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సంస్థలు ప్రకటించిన అన్ లిమిటెడ్ రీ ఛార్జ్ ప్లాన్ లు వినియోగదారులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ఈ ప్లాన్ లో కాల్స్ అన్ లిమిటెడ్ ఉండడంతో పాటు డేటా ప్యాక్ ను కూడా 28 రోజుల కాలపరిమితితో అందజేయడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రీఛార్జ్ ప్యాక్ ల వివరాల్లోకి వెళ్తే...

రిలయన్స్ జియో... 99 రూపాయలు చెల్లించి ప్రైమ్ లో రిజిస్టరైన వినియోగదారులు 303 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 28 జీబీ 4జీ డేటాను కూడా పొందుతారు. అదే జియో ప్రైమ్ పోస్ట్ పెయిడ్ యూజర్లకైతే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 30 జీబీ 4జీ డేటాను అందించనున్నారు. ప్రీపెయిడ్ యూజర్లు 499 రూపాయలతో జియో ప్రైమ్ రీఛార్జ్ ప్యాక్ ను వేసుకుంటే 56 జీబీ 4జీ డేటాను అందిస్తామని రిలయన్స్ తెలిపింది. ఇందులో రోజూ 2జీబీ 4జీ డేటాను వినియోగించుకోవచ్చు. ఇదే పోస్టు పెయిడ్ వినియోగదారులైతే 60జీబీ 4జీ డేటాను పొందవచ్చు.

ఎయిర్ టెల్... ప్రీపెయిడ్ వినియోగదారులు 345 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 28 జీబీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. రోజూ 1జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఇందులో పగలంతా 500 ఎంబీ వినియోగించుకోవాల్సి ఉండగా, అర్థరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మిగిలిన 500 ఎంబీని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా రోజులో ఏ టైమైనా 1 జీబీ డేటా వాడుకోవాలనుకుంటే మాత్రం 549 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ లిమిటెడ్ కాల్స్ లో కూడా 1200 (20 గంటలు) నిమిషాల వరకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అవి దాటితే నిమిషానికి 30 పైసలు ఛార్జ్ చేస్తారు.

వొడాఫోన్...346 రూపాయలతో ప్రీపెయిడ్ వినియోగదారులు రీఛార్జ్ చేసుకుంటే ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 28 జీబీ డేటాను వొడాఫోన్ అందజేయనుంది. ఈ ప్యాక్ లోని వినియోగదారులు రోజూ 1 జీబీ డేటా వినియోగించుకోవచ్చని వొడా ఫోన్ తెలిపింది. డేటాతో సంబంధం లేకుండా అయితే కేవలం 295 రూపాయలకే వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు అందజేస్తోంది. ఈ రీఛార్జ్ తో కేవలం 2 జీబీని అందిస్తోంది. డేటాఎక్కువ వాడితే ఛార్జ్ చేస్తుంది.

ఐడియా...ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 348 రూపాయల రీఛార్జ్ తో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 14 జీబీ ఉచిత డేటాను అందించనుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ 500 ఎంబీ డేటాను వినియోగించుకోవచ్చని ఐడియా ఆఫర్ ఇచ్చింది. అయితే ఈ ఆపర్ కేవలం 4జీ హ్యాండ్ సెట్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో వుండడం గమనార్హం.

More Telugu News