: భారత్ స్టెంట్లతో పాక్ లో రోగులను దోచేస్తున్న వైద్యులు!

పాకిస్థాన్‌ లో వైద్యుల ఘరానా మోసం వెలుగు చూసింది. గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి భారత్ లో తయారయ్యే స్టెంట్లు ప్రాణం పోస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ స్టెంట్లు సరసమైన ధరకే భారత్ లో లభిస్తాయి. కేవలం 25,000 రూపాయల నుంచి 28,000 రూపాయల మధ్యలో ఈ స్టెంట్లు భారతీయ మార్కెట్ లో లభ్యమవుతాయి. అదే అంతర్జాతీయ స్టెంట్ కు అయితే 3 లక్షల రూపాయల నుంచి 3.5 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ వైద్యులు భారత్ నుంచి స్టెంట్లు దిగుమతి చేసుకుని, అంతర్జాతీయ స్టెంట్లు అని చెప్పి రోగుల నుంచి 3 నుంచి 3.5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని దునియా న్యూస్ వెల్లడించింది. దిగుమతి చేసుకున్న భారత్ స్టెంట్లకు నకిలీ బార్ కోడ్ లు, నకిలీ బ్రాండ్ పేర్లు తయారు చేసి అతికించి, రోగులకు చూపించి, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని సదరు మీడియా సంస్థ ఆరోపించింది. దీనిపై పాక్ లో పెను దుమారం రేగుతోంది. భారత్ లో లభించే స్టెంట్లు ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభ్యమై సమర్థవంతంగా పని చేసే స్టెంట్లుగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. 

More Telugu News