: జైట్లీ బడ్జెట్ కు స్టాక్ మార్కెట్ చీర్స్... పావుగంటలో 350 పాయింట్ల పెరుగుదల

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్ ప్రతిపాదనలు స్టాక్ మార్కెట్ వర్గానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. పన్ను ప్రతిపాదనల విభాగానికి జైట్లీ ప్రసంగం వచ్చిన తరువాత ఒక్కసారిగా కొనుగోళ్లు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 12:52 గంటల సమయంలో 27,631 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక 13:06కు 27,983 పాయింట్లకు జంప్ చేసింది. ఆపై స్వల్ప అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ లాభాన్ని నిలుపుకుంది. మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 307 పాయింట్లు పెరిగి 1.11 శాతం లాభంతో 27,963 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 86.50 పాయింట్లు పెరిగి 1.01 శాతం లాభంతో 8,651 పాయింట్ల వద్దా కొనసాగాయి. నిఫ్టీ-50లో 33 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రాసిమ్, ఐటీసీ, ఎస్బీఐ తదితర కంపెనీలు లాభపడగా, అరవిందో ఫార్మా, ఐడియా, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.

More Telugu News