: ఆటో కంపెనీలపై ట్రంప్ తొలి తూటాలు... దీటుగా స్పందించిన జర్మనీ!

అమెరికా అధ్యక్షుడిగా ఇంకా బాధ్యతలు కూడా తీసుకోకుండానే ట్రంప్ దూకుడుగా ఉన్న వేళ, జర్మనీకి చెందిన ఆటో కంపెనీలు ఆయన వైఖరిపై మండిపడుతున్నాయి. మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికాకు ఎగుమతి చేస్తున్న సంస్థలపై 35 శాతం 'సరిహద్దు పన్ను' (బార్డర్ టాక్స్) విధించనున్నామని ట్రంప్ చేసిన ప్రకటనతో జర్మనీ తీవ్రంగా స్పందించింది. పలు జర్మనీ సంస్థలు మెక్సికో కేంద్రంగా వాహన తయారీ ప్లాంట్లను నెలకొల్పిన నేపథ్యంలో, ట్రంప్ వైఖరిపై జర్మనీ వైస్ చాన్స్ లర్ సిగ్మార్ గాబ్రియేల్ స్పందించారు. ఈ తరహా పన్నులు అమెరికా వాహన పరిశ్రమకు ఎంత మాత్రమూ మేలు చేయలేవని అన్నారు.

అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని, అందులో భాగంగా, యూఎస్ లో విక్రయించే కార్లను ఇక్కడే తయారు చేయడాన్ని కంపెనీలు ప్రారంభించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా బీఎండబ్ల్యూ, డైమ్లర్, వోక్స్ వాగన్ వంటి సంస్థలు మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికాలో విక్రయిస్తుంటే, వీటినే లక్ష్యంగా చేసుకుని ట్రంప్ మాట్లాడారు. ఇక అమెరికాలో కార్ల పరిశ్రమ చాలా బలహీనమని, అక్కడ కార్లు తయారు చేయడమంటే వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదని జర్మనీ దినపత్రిక 'బిల్డ్'తో గాబ్రియేల్ వ్యాఖ్యానించారు.

న్యూయార్క్ వీధుల్లో అమెరికన్ కార్ల కన్నా, జర్మనీ కార్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితి త్వరలో పోతుందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన గాబ్రియేల్, పరిస్థితిని మార్చాలనుకుంటే, మరింత మెరుగైన, సౌకర్యవంతమైన కార్లను తయారు చేయడంపై అమెరికా సంస్థలు దృష్టిని సారించాలని సలహా ఇచ్చారు. కాగా, ట్రంప్ తాజా ప్రకటన తరువాత, జర్మన్ ఆటో సంస్థలతో పాటు టయోటా వంటి కంపెనీల ఈక్విటీ వాటాలు నష్టపోయాయి.

More Telugu News