: రిజర్వ్ బ్యాంకును నాశనం చేశారు... నేనుంటే రాజీనామా చేసేవాడిని: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పెద్ద నోట్ల రద్దు దేశానికి మేలు చేసే నిర్ణయం కాదని, అభివృద్ధిని దశాబ్దాల పాటు వెనక్కు నెట్టేసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తానే ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న వేళ, నోట్ల రద్దు తెరపైకి వస్తే, వద్దని చెప్పేవాడినని, అప్పటికీ ఒత్తిడి తెస్తే, ఆసుపత్రిలో చేరిపోయి, రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకునేవాడినని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని పలు రేటింగ్ సంస్థలు ప్రశ్నించాయని, స్టాండర్డ్ అండ్ పూర్ వంటి సంస్థ ఆర్బీఐ అధికారాలను, ప్రస్తుత విధానాలను ప్రశ్నిస్తుంటే, తనకెంతో బాధ కలిగిందని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు.

నోట్ల రద్దు తరువాత, ఎంతో మాట్లాడాల్సిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మిన్నకుండిపోయారని అన్నారు. దేశ ప్రజలకు బాసటగా నిలిచి, రద్దు గురించి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన ఆయన, ఎందుకు ముందు నిలవలేదని ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకున్నప్పటికీ, అమలు చేయాల్సిన బాధ్యత ఆర్బీఐదేనని అన్నారు. తన స్వతంత్రతను కాపాడుకునేలా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నించాలని, ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలా మారకూడదని హితవు పలికారు.

More Telugu News