: పీవీ సింధుకు అన్ని కోట్లు ఇచ్చారా?... నోరెళ్లబెట్టిన ఒలింపిక్ ఛాంపియన్

రియో ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన షట్లర్ పీవీ సింధు తెలుగు ఖ్యాతిని అమాంతం పెంచింది. ఈ నేపథ్యంలో, సింధుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ నజరానాలు ఇచ్చాయి. మొత్తం మీద రూ. 13 కోట్ల మేర నగదును సింధు నజరానాగా అందుకుంది. దీనిపై ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కరోలినా మారిన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

"సింధుకు అందిన డబ్బు గురించి విని చాలా ఆశ్చర్యపోయా. ఆమె కోట్లకు పడగలెత్తింది. ఇక్కడ కూడా నాకు మా ప్రభుత్వం నజరానా ఇచ్చింది. అయితే సింధు అందుకున్న దాంట్లో పదో, పదిహేను శాతమో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. పథకాలు గెలిచిన క్రీడాకారులు ఇక్కడెంత పాప్యులరో అనే విషయం" అని కరోలినా తెలిపింది.

కరోలినా మారిన్ ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతోంది. బంగారు పథకం నెగ్గిన ఆమెకు స్పెయిన్ ప్రభుత్వం రూ. 70 లక్షలు అందజేసిందట. మరోవైపు, సింధుకు అందిన భారీ పారితోషికంపై కరోలినా కోచ్ ఫెర్నాండో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒలింపిక్ ఛాంపియన్లకు భారీ నజరానాలు ఇవ్వడం అభినందించదగ్గ విషయమని ఫెర్నాండో తెలిపాడు.

More Telugu News