jio: ఆఫర్లు ముగిసినా వినియోగదారులు రిలయన్స్ జియోనే వాడాలనుకుంటున్నారట!.. సర్వేలో వెల్లడి

ఉచిత మంత్రంతో మార్కెట్లోకి వ‌చ్చి ఊహించ‌ని విధంగా క‌స్ట‌మ‌ర్ల‌ను సొంతం చేసుకున్న రిల‌య‌న్స్ జియోను స్మార్ట్‌ఫోను యూజ‌ర్లు ఎంత కాలం వాడ‌తారు? ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల గ‌డువు అయిపోయిన త‌రువాత కూడా జియోని ఉప‌యోగిస్తారా? లేదంటే సెల్‌ఫోన్‌ల నుంచి ఆ సిమ్‌కార్డును తీసి పారేస్తారా? ఈ అంశంపైనే బ్యాంక్‌ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ ఓ సర్వే జ‌రిపింది. ఆ స‌ర్వేల్లో ప‌లు విష‌యాలు వెల్ల‌డయ్యాయి. రిలయన్స్ జియోకు ఆఫర్ల గడువు ముగిసిన తర్వాత కూడా క‌స్ట‌మ‌ర్లు ఆ సిమ్ కార్డుల‌ను వ‌ద‌ల‌బోర‌ట‌.

మార్చి 31 త‌రువాత జియో డేటా సర్వీసుల ఆఫ‌ర్ ముగిశాక‌, డేటా ఛార్జ్ లు వేసిన‌ప్ప‌టికీ వినియోగ‌దారులు ఆ సిమ్‌కార్డుల‌నే ఉప‌యోగిస్తార‌ని స‌ర్వే ద్వారా తెలిసింద‌ని బ్యాంక్‌ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ తెలిపింది. సుమారు 85 శాతం కస్టమర్లు మార్చి 31 త‌రువాత కూడా జియోను వాడేందుకే సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొంది. కాక‌పోతే, వారిలో 67 శాతం మంది ఈ సిమ్‌ను రెండో సిమ్గానే వాడతారని తెలిపింది. సుమారు 18 శాతం మంది యూజ‌ర్లు మొదటి సిమ్గా ఉప‌యోగిస్తార‌ట‌. మ‌రోవైపు సిమ్ కార్డుల విష‌యంలో భార‌తీ ఎయిర్‌టెల్‌పైనే ఎక్కువ‌మంది సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌ర్వేలో తేలింది.

ఎయిర్‌టెల్ పై ఏకంగా 97.7 శాతం మంది క‌స్ట‌మ‌ర్లు సంతృప్తికరంగా ఉన్నార‌ని సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ సిమ్‌ను వాడేవారిలో 17 శాతం మంది మాత్ర‌మే జియోపై ఆసక్తి చూపుతున్నారని, ఏప్రిల్ 1 నుంచి క్వాలిటీ బాగుంటేనే జియోను మొదటిసిమ్గా వాడతామని స‌ర్వేలో తెలిసింది. జియోకు మరలిన కస్టమర్లలో ఎక్కువ‌మంది వాటిని రెండో సిమ్గానే వాడాలని భావిస్తున్నట్లు తేలింది. జియో సిమ్‌ను 26 శాతం మంది యూజర్లు మొదటి సిమ్గానే వాడుతున్నారని తెలిసింది. ఇటీవ‌ల జియో నెట్ స్పీడ్ను కూడా పెంచేసిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆ సిమ్‌కార్డుల ప‌రిస్థితి అస్థిరంగా ఉందని స‌ర్వే ద్వారా తెలిసింది. అయితే, యూజ‌ర్ల‌లో 44 శాతం మంది మాత్రమే జియో స్పీడ్ తక్కువగా ఉందని అన్నారు.  

jio

More Telugu News