: ఆ పరీక్ష ఇక ఇంట్లోనే చేసుకోవ‌చ్చు.. మీ 'సత్తా' ఏంటో తెలుసుకోవ‌చ్చు!

కార‌ణాలు ఏవైతేనేం, ప్ర‌స్తుతం సంతాన‌లేమితో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సంతానం క‌ల‌గ‌క‌పోతే దానికి కార‌ణం భార్య‌లోనే లోప‌ముంద‌ని భావించ‌డం మ‌న స‌మాజంలో అనాదిగా వ‌స్తున్న‌దే. అయితే ఈ విష‌యంలో పురుషుల్లో కూడా లోప‌ముండే అవ‌కాశం ఉంద‌ని భావించేవారు బ‌హు త‌క్కువ‌. దీనికి తోడు సంతాన సామ‌ర్థ్య ప‌రీక్ష‌ల కోసం ముందుకొచ్చే మ‌గాళ్ల సంఖ్య కూడా చాలా త‌క్కువ‌. అంతకుమించి ఆ ప‌రీక్ష చేయించుకునేందుకు చాలామంది పురుషులు సిగ్గుప‌డుతుండ‌డం కూడా ఇందుకు మ‌రో కార‌ణం.

అయితే ఇక నుంచి ఆ సమ‌స్య తీరిపోయిన‌ట్టే. ఎందుకంటే ఇక‌మీద‌ట త‌మ 'స‌త్తా'ను ఇంటి వద్దే తెలుసుకునే ప‌రీక్ష త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది. అంటే ఇంట్లో చేసుకునే మ‌ధుమేహం, గ‌ర్భ నిర్ధార‌ణ  ప‌రీక్ష‌ల్లాగే దీనిని కూడా చేసుకోవ‌చ్చు. ఖ‌ర్చు కూడా చాలా త‌క్కువ‌. ఇందుకు సంబంధించిన కిట్‌ను  తెలుగు శాస్త్ర‌వేత్త రూపొందించారు. ముంబైలోని జాతీయ పున‌రుత్పాద‌న ఆరోగ్య ప‌రిశోధ‌న సంస్థ‌(ఎన్ఐఆర్ఆర్‌హెచ్‌) శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ కేఎన్ఆర్‌రెడ్డి దీన్ని అభివృద్ధి చేశారు. వంద‌ రూపాయలకే అందుబాటులో ఉండే ఈ కిట్ ద్వారా వంద‌సార్లు ప‌రీక్ష చేసుకోవ‌చ్చు. అంటే ఒక ప‌రీక్ష‌కు రూపాయి మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌మాట‌. దేశంలో ఇటువంటి కిట్ అందుబాటులోకి రావ‌డం ఇదే తొలిసారి.

 దేశ ప్ర‌మాణాల ప్ర‌కారం పురుషుల వీర్యంలో మిల్లీ లీట‌ర్‌కు 60 మిలియ‌న్ వీర్య‌క‌ణాలు ఉండాలి. కనీసం 20 మిలియ‌న్ క‌ణాలున్నా సంతానం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. తాజాగా అభివృద్ధి చేసిన కిట్‌తో వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్ల‌కుండానే సంతాన యోగ్య‌త ఉన్న‌దీ, లేనిదీ తెలుసుకోవ‌చ్చు. ఒక‌వేళ త‌మ‌లో వీర్య‌క‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తేలితే ఆ త‌ర్వాత వైద్యుడిని సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని ఐసీఎంఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రజనీకాంత్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

More Telugu News