: అంగారకుడిపై జీవం ఉందనడానికి సాక్ష్యం ఇదిగో.. అంటున్న ఏలియన్ హంటర్లు!

అంగారక గ్రహంపై జీవరాశి ఉందని, మానవ మనుగడకు మార్స్ ఉపయోగపడుతుందని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు కఠోర పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రహంపై ఉనికిని కనుగొనేందుకు క్యూరియాసిటీ రోవర్ ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ మార్స్ రోవర్ ఆ గ్రహానికి చెందిన ఎన్నో చిత్రాలను పంపింది. అది పంపిన ప్రతి చిత్రాన్ని ఏలియన్‌ హంటర్లు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై జీవరాశి ఉనికిని కనుగొన్నామని ప్రకటించారు. క్యూరియాసిటీ రోవర్‌ పంపిన అంగారకుడి చిత్రాల్లో కొన్ని జంతువుల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు వెల్లడించారు.

అందులోని ఓ చిత్రంలో వెంట్రుకలు కలిగిన నాలుగు కాళ్ల సాలెపురుగులా పాకుతున్న ఓ జంతువును గుర్తించామని యూఎఫ్వో సైటింగ్స్‌ డైలీ డాట్‌ కామ్‌ కు చెందిన స్కాట్‌ సీ వారింగ్‌ తెలిపారు. ఇది సాలెపురుగులా పాకుతున్నప్పటికీ చూసేందుకు అచ్చం కోతిలా ఉందని తెలిపారు. మరికొన్ని చిత్రాల్లో నత్త, మరో పాకుతున్న జంతువును కూడా గుర్తించామని ఆయన పేర్కొన్నారు.  

భద్రతా కారణాల రీత్యా అమెరికా ప్రభుత్వం యూఎఫ్వో, ఏలియన్ ఇంటెలిజెన్స్ గురించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచిందని ఆయన తెలిపారు. కాగా, మార్స్ నుంచి క్యూరియాసిటీ రోవర్ గత ఆరేళ్లుగా ఎన్నో ఫోటోలు పంపుతోంది. ఇందులో ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలు ఉన్నాయని ఏలియన్ హంటర్స్ పేర్కొంటున్నారు. 

More Telugu News