dog biryani: కుక్క బిర్యాని అమ్ముతున్నారంటూ వాట్సప్ ద్వారా వదంతులు వ్యాప్తి చేసిన హైదరాబాదు యువకుడి అరెస్ట్

హైదరాబాద్‌ రాయ‌దుర్గంలోని షా గౌస్ హోటల్‌లో కుక్క బిర్యాని అమ్ముతున్నార‌ని ఇటీవ‌ల విప‌రీతంగా పుకార్లు చెల‌రేగిన విష‌యం తెలిసిందే. అవే పుకార్ల‌ను న‌మ్మేసిన న్యూస్ ఛానెళ్లు కూడా ఆ హోట‌ల్‌లో కుక్క బిర్యాని అమ్ముతున్నార‌ని చెప్పేశాయి. దీంతో న‌గ‌రంలోని బిర్యాని ప్రియులంద‌రూ వికారానికి గుర‌య్యారు. ఇక‌ జీహెచ్ఎంసీ హెల్త్ అధికారులు షా గౌస్ హోటల్ పై రైడ్ కూడా నిర్వహించారు. ఏ పాపం చేయ‌ని స‌ద‌రు హోట‌ల్ య‌జ‌మాని మహమ్మద్ రబ్బానీ త‌ప్పుడు వార్త‌ల కార‌ణంగా తమ హోటల్ పరువుపోయిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు జ‌రిపి అస‌లు విష‌యాన్ని క‌నుగొన్నారు.

ఈ పుకార్లు రావ‌డానికి చంద్రమోహన్  అనే యువ‌కుడు కారణమని విచారణలో తేలడంతో అతనిని అరెస్టు చేశారు. కుక్క మాంసంతో బిర్యాని తయారు చేస్తున్నారని ఈ యువ‌కుడే ఫేక్ న్యూస్ ను సృష్టించి త‌న‌ వాట్సాప్ ద్వారా త‌న స్నేహితుల‌కి పంపించాడని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ కు వెళ్తున్న త‌న‌ స్నేహితులను భయపెట్టేందుకు ఎంబీఏ విద్యార్థి అయిన‌ చంద్రమోహన్ ఈ పుకారును త‌న స్నేహితుల‌కి పంపించాడ‌ని పోలీసులు తెలిపారు.

అందుకోసం తల నరికిన కుక్కల ఫొటోలను సృష్టించి, రాయ‌దుర్గంలోని షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంటూ ఫేక్ న్యూస్ ను పంపించాడు. దీంతో చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను వేరే వాట్సాప్ గ్రూప్ లకు పంపించారు. ఇలా ఆ న్యూస్ వాట్స‌ప్ లో చ‌క్క‌ర్లు కొట్టింది. వాట్సప్ గ్రూప్ లను పరిశీలించుకుంటూ వెళ్లగా ఆ న్యూస్‌ను చంద్రమోహన్ సృష్టించాడ‌ని త‌మ‌కు తెలిసింద‌ని పోలీసులు తెలిపారు. ఇదే ఫేక్ న్యూస్‌ను న‌మ్మిన న్యూస్ చానెళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా ప్ర‌సారం చేశాయి.

More Telugu News