: చైనాకు కాసుల పంట పండించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశపు స్వైపింగ్ మెషీన్లకు గిరాకీ!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చైనాకు కాసుల పంట పండిస్తోంది. నల్లధనం అంతం, ఉగ్రవాదంపై పోరాటం అంటూ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో క్యాష్ లెస్ బిజినెస్, డిజిటలైజేషన్ ను విస్తరిస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా భారత్ కు భారీ ఎత్తున స్వైపింగ్, పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లు అవసరమయ్యాయి. వీటిని కొన్ని దేశాలు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ప్రధానంగా ఫ్రాన్స్, చైనా దేశాలు ఈ మెషీన్లను తక్కువ ధరకు తయారు చేస్తున్నాయి. ఫ్రాన్స్ కు చెందిన మెషీన్లు 10 నుంచి 15 వేల రూపాయల ఖరీదు కాగా, చైనాకు చెందిన మెషీన్లు 7 వేల రూపాయల నుంచి 9,600 రూపాయల ఖరీదు చేస్తున్నాయి.

దీంతో ఈ మెషీన్లను పెద్దఎత్తున తెప్పించుకునేందుకు అధికారులు చైనాను ఆశ్రయించారు. చైనాలో ఈ పీవోఎస్ మెషీన్లు 'వేరీఫోన్', 'ఇంజనికో' కంపెనీల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీలతోపాటు మరో రెండు కంపెనీలకు భారీ ఎత్తున ఈ మెషీన్లు తయారు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 14 లక్షల పీవోఎస్ మెషీన్లు వినియోగంలో ఉండగా, ఇప్పటికిప్పుడు మరో రెండు లక్షల మెషీన్లు కావాల్సి ఉంది. భవిష్యత్ లో కూడా వీటి అవసరం భారీ ఎత్తున ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటిని తయారు చేసే కంపెనీకి రాయితీలు ప్రకటించకుండా, చైనా నుంచి తెప్పించుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దుతో మేకిన్ ఇండియా కొంత కుంటుపడగా, తాజా నిర్ణయంతో భారత్ లో పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఏంటని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

More Telugu News