revanth: స‌స్పెండ్ అయిన తరువాత స్పీక‌ర్ కార్యాల‌యం ఎదుట‌ రేవంత్, సండ్ర ధ‌ర్నా.. అడ్డుకున్న మార్ష‌ల్స్

తెలంగాణ శాస‌న‌స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో టీడీపీ స‌భ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ మ‌ధుసూద‌నా చారి ప్రకటించిన విష‌యం తెలిసిందే. స‌స్పెండ్ అయిన రేవంత్, సండ్ర స్పీక‌ర్ కార్యాల‌యం ఎదుట ఈ రోజు ధ‌ర్నాకు దిగారు. వారిని మార్ష‌ల్స్ అడ్డుకోవ‌డంతో స్వ‌ల్ప ఉద్రిక్త‌త నెల‌కొంది. అనంత‌రం మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... వాయిదా తీర్మానాలపై చర్చను చేపట్టాలని కోరితే స‌స్పెండ్ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌ను అన్యాయంగా స‌స్పెండ్ చేశారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాస‌న‌స‌భ సంప్ర‌దాయాల ప్ర‌కారం చ‌ర్చ చేప‌ట్టిన‌ప్పుడు స‌భ్యులంద‌రికీ అవ‌కాశం ఇచ్చి, వారి అభిప్రాయాలు వెల్ల‌డించిన త‌రువాత ఒక నిర్ణ‌యం తీసుకోవాలని అన్నారు. స‌భ‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నిస్తామ‌నే త‌మ‌ను బ‌య‌ట‌కు పంపించేశారని చెప్పారు.

More Telugu News