: భారీగా పెరగనున్న పెట్రో ధరలు.. లీటరకు రూ.6 పెంపు!

నోట్ల రద్దుతో అతలాకుతలమవుతున్న సామాన్య ప్రజానీకం నెత్తిన ఇప్పుడు పెట్రో బాంబు విసిరేందుకు చమురు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు 15 శాతం మేర పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరకు రూ.6 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు ఎగుమతి చేసే ఒపెక్ దేశాలు 2001 తర్వాత మళ్లీ ఇప్పుడు సరఫరాను తగ్గించాలని నిర్ణయించడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు చమురు కంపెనీలు భేటీ అయి ధరలను సమీక్షించనున్నాయి.

భారత్ వినియోగించే చమురులో దాదాపు 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే కావడం గమనార్హం. గత  పదిహేను రోజులుగా చమురు ధర సగటున 51 డాలర్లుగా కొనసాగుతూ వస్తోంది. అంతకుముందు 44.46 డాలర్లుగా ఉండేది. అయితే సోమవారం (12న) ఒక్కసారిగా 54.42 డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో రూ.3677.60. ఈ నేపథ్యంలో పెట్రోలు ధర లీటరుకు ఐదారు రూపాయలు పెంచడం మినహా మరో మార్గం లేదని చమురు కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల ఇబ్బందుల కారణంగా ఒకేసారి అంత భారాన్ని మోపకుండా రెండు విడతలుగా వినియోగదారులను బాదే అవకాశం ఉందని కేఆర్ చోక్‌సీకి కంపెనీకి చెందిన ఆర్థిక నిపుణుడు వైభవ్ చౌదరి అన్నారు. మొదట మూడు నాలుగు రూపాయలు పెంచి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందని ఇంకొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News