: భోజ‌నానికి ముందే కాదు.. ఏటీఎం కార్డు ఉప‌యోగం త‌ర్వాత కూడా చేతులు క‌డుక్కోవాల్సిందే!

అదేంటి? డెబిట్ కార్డు ఉప‌యోగం త‌ర్వాత చేతులు క‌డుక్కోవ‌డం ఎందుకు? అనే సందేహం రావ‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే సాధార‌ణంగా భోజ‌నానికి ముందు, బాత్రూం వినియోగం త‌ర్వాత చేతులు క‌డుక్కోవ‌డం స‌హ‌జం. చేతులు మురికిగా మారిన ప్ర‌తిసారి శుభ్రం చేసుకోవ‌డం ప‌రిపాటి. మ‌రి ఏటీఎం కార్డు ఉప‌యోగించాక ఎందుకు? అంటే అమెరికా ప‌రిశోధ‌కులు ఏమంటున్నారో చూడండి... ఏటీఎం సెంట‌ర్ల‌లో మాన‌వుల చ‌ర్మంలోని సూక్ష్మ జీవులు (స్కిన్ మైక్రోబ్స్‌) వ్యాపించి ఉంటున్నాయ‌ని, ఇవి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని త‌మ ప‌రిశోధ‌న‌లో తేలింద‌ని పేర్కొన్నారు. ఏటీఎం ఉప‌యోగించాక చేతులు కడుక్కోకుంటే అవి నోటి ద్వారా క‌డుపులోకి చేరి అనారోగ్యానికి కార‌ణ‌మ‌య్యే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌, మాన‌హ‌ట‌న్‌, క్వీన్స్ ప్రాంతాల్లోని 66 ఏటీఎంల నుంచి సేక‌రించిన ధూళిని ల్యాబుల్లో ప‌రీక్షించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని న్యూయార్క్ యూనివ‌ర్సిటీకి చెందిన సెంట‌ర్ ఫ‌ర్ జినోమిక్ అండ్ సిస్ట‌మ్ బ‌య‌లాజీకి చెందిన జేన్ కార్ల్‌ట‌న్ వివ‌రించారు. అందుకే ఏటీఎం ఉప‌యోగించిన ప్ర‌తిసారి చేతులు క‌డుక్కోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్నారు.

More Telugu News