: భారత్‌లో యాపిల్ తయారీ యూనిట్.. రాయితీలు కల్పిస్తే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతామన్న సంస్థ

ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ భారత్‌లో తన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం కనుక తగిన రాయితీలు కల్పిస్తే యూనిట్ ఏర్పాటుకు తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని కేంద్ర రెవెన్యూ, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖలకు తెలిపినట్టు సమాచారం. అమెరికా, కొరియా, జపాన్, దేశాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్న యాపిల్ సంస్థ భారత్‌లోనూ ఓ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం మేలోనే కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకుంది. అయితే విదేశీ పెట్టుబడుల విషయంలో అప్పట్లో ఉన్న నిబంధనల కారణంగా ఆమోదం లభించలేదు. ప్రస్తుతం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు మోడిఫైడ్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీ స్కీం (ఎంఎస్ఐపీఎస్)ను కేంద్రం ప్రకటించింది. అంతేకాక ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీ యూనిట్లు స్థాపించేందుకు పలు రాయితీలు కల్పించింది. దీంతో యాపిల్ సంస్థ మరోమారు తన ఆసక్తిని వెల్లడించింది. కేంద్ర రెవెన్యూ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలకు సమాచారం అందించింది. యాపిల్ దరఖాస్తుపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News