: నవంబర్ 15 డెడ్ లైన్... టాటా కంపెనీల్లో మరింత డ్రామా!

టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించినప్పటికీ, ఇంకా పలు టాటా కంపెనీల్లో మిస్త్రీయే చైర్మన్ హోదాలో ఉండటం, ఈ కంపెనీలన్నీ రెండో త్రైమాసికం ఫలితాలను నవంబర్ 15లోగా ప్రకటించాల్సి వుండటంతో టాటా గ్రూప్ సంస్థలపై అటు ఇన్వెస్టర్లు, ఇటు సెబీ వంటి నియంత్రణా సంస్థలు నిశితంగా కన్నేశాయి. మరో రెండు వారాల్లోగా ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సిన టాటా స్టీల్, టాటా మోటార్స్, టీసీఎస్, ది ఇండియన్ హోటల్స్, టాటా గ్లోబల్ బీవరేజస్, టాటా కెమికల్స్, టాటా టెలీ సర్వీసెస్ వంటి కంపెనీల్లో చైర్మన్ గా ఆయన పేరే ఉంది. ఈ కంపెనీలన్నీ డైరెక్టర్ల బోర్డు సమావేశాలు నిర్వహించి ఫలితాలకు ఆమోదం వేయాల్సి వుంది. టాటా గ్రూప్ లోని 13 కంపెనీలు ఇంకా జూలై - సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించలేదు. లిస్టెడ్ కంపెనీలన్నీ త్రైమాసికం ముగిసిన 45 రోజుల్లోగా, అంటే నవంబర్ 15 లోగా ఫలితాలను వెల్లడించాల్సి వుంది. ఇంకా ఫలితాలు చెప్పని కంపెనీల్లో మార్కెట్ గమనాన్ని శాసించే స్థితిలో ఉండే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్ వంటి కంపెనీలుండగా, వీటిల్లో మిస్త్రీయే ఇప్పటికీ చైర్మన్ గా ఉన్నారు. కాగా, సాధ్యమైనంత వేగంగా ఈ కంపెనీల నుంచి మిస్త్రీ తప్పుకోవడం లేదా తొలగించడం జరగాల్సి వుందని, లేకుంటే ఇన్వెస్టర్లకు తప్పుడు సంకేతాలు వెళ్లి, అది సంస్థ మార్కెట్ కాప్ కు నష్టం కలిగించవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News