: పాత స్మార్ట్ ఫోన్ ఉందా... పారేయకండి.. ఎన్నో ఉపయోగాలున్నాయ్ మరి!

మారుతున్న కాలానికి అనుగుణంగా, రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దిగుతున్న వేళ... ఏదో ఒక రోజు పాత ఫోన్ ను పక్కన పడేసి కొత్తది కొనేందుకు ఉత్సాహం చూపుతుంటాం. ఈ నేపథ్యంలో పాత స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా మూలన పడేయకుండా చక్కగా వినియోగించుకునే మార్గాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిఘా కెమెరాలుగా: ఇంట్లోనో, కార్యాలయంలోనో నిఘా కెమెరాలుగా పాత స్మార్ట్ ఫోన్లు చక్కగా పనిచేస్తాయి. వీటిలోని డేటాను తీసివేసి, మెమొరీ కార్డును వేసి ఐపీ వెబ్ కామ్ లేదా టినీ కామ్ మానిటర్ వంటి యాప్ వేసుకుని ఎక్కడైనా సీసీటీవీగా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలను క్లౌడ్ స్టోరేజ్ సర్వర్లలో అప్ లోడ్ చేసుకుని కంప్యూటర్ లో ఎక్కడి నుంచైనా చూసుకునే సౌలభ్యం ఉంది. కారులో జీపీఎస్ గా: మీరు కొత్త నగరానికి వెళ్లినప్పుడు లేదా ఉన్న చోటే ట్రాఫిక్ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు తెలియజేసేలా మీ పాత స్మార్ట్ ఫోన్ ను జీపీఎస్ గా వాడుకుని కారులో బిగించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రతి కారులో జీపీఎస్ తప్పనిసరి అవసరంగా మారుతున్న వేళ, దీనికోసం అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ ఫోటో ఫ్రేమ్ గా: మీ వద్ద ఉన్న ఆపాత మధుర చిత్రాలను పాత స్మార్ట్ ఫోన్ లో ఫీడ్ చేసుకుని, దాన్ని ఆఫీస్ టేబుల్ పై ఓ డిజిటల్ ఫోటో ఫ్రేమ్ గా అలంకరించుకోవచ్చు. ఫోటోలు ఒకదాని తరువాత ఒకటి డిస్ ప్లే అవుతుండగా, మీ పాత స్మార్ట్ ఫోన్ ఆఫీసు వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరం చేస్తుంది. మీడియా సర్వర్: ఇష్టమైన సంగీతం నుంచి వీడియోల వరకూ పాత స్మార్ట్ ఫోన్ ను మీడియా సర్వర్ గా వాడుకోవచ్చు. దానిలోని వివిధ రకాల మీడియాను, కొత్త ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోకుండానే చూసుకునే సౌలభ్యం ప్లెక్స్, బబుల్ యూపీఎన్పీ వంటి యాప్స్ సాయంతో దగ్గరవుతుంది. యూనివర్సల్ రిమోట్ కంట్రోల్: మీ పాత స్మార్ట్ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్ తో వచ్చివుంటే, దాన్ని అన్ని రకాల గృహోపకరణాలకూ యూనివర్సల్ రిమోట్ గా వినియోగించుకోవచ్చు. టీవీల నుంచి ఏసీల వరకూ అన్నింటినీ నియంత్రించవచ్చు. ఈ-బుక్ రీడర్ గా: మీకు నచ్చిన, మీరు మెచ్చిన పుస్తకాల సమాచారాన్ని ఫోన్ మెమొరీలో దాచుకుని, వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే ఈ- బుక్ రీడర్ గా మీ పాత స్మార్ట్ ఫోన్ ను వినియోగించుకోవచ్చు. వైర్ లెస్ హాట్ స్పాట్: మీ ఇంట్లో ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ లేకుంటే, పాత స్మార్ట్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుందన్న మాటే. ఓ సపరేట్ 4జీ సిమ్ తీసుకుని, దానికి తక్కువగా లభించే 3జీ, 4జీ డేటా ప్యాక్ లను మాత్రమే వేసుకుంటూ, స్మార్ట్ ఫోన్ ను హాట్ స్పాట్ గా మార్చి మిగతా ఫోన్లకు వై-ఫై వాడుకోవచ్చు. చిన్నారులకు తొలి స్మార్ట్ ఫోన్ గా: మీరు ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొన్న వేళ, పాత ఫోన్ ను స్మార్ట్ ఫోన్ పరిచయం లేని వారికి అందిస్తే వారికెంతో మేలు కలుగుతుంది. ఇక ఇంట్లోని చిన్నారులకు తొలి స్మార్ట్ ఫోన్ గానూ దీన్ని అందించవచ్చు.

More Telugu News