: వచ్చే పదేళ్లలో మాయం కానున్న గాడ్జెట్స్ ఇవే!

అధునాతన సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, ఎన్నో ఎన్నెన్నో ఉపకరణాలు జీవనాన్ని సులభం చేస్తున్నాయి. పదేళ్ల క్రితం వినిపించని, ఊహించనివి ఎన్నో నేడు ప్రపంచం ముందున్నాయి. ఇక మరో పదేళ్లలో ఇంకెన్నో వస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో మాయం కావచ్చని టెక్ నిపుణులు భావిస్తున్న గాడ్జెట్స్ వివరాలివి. స్మార్ట్ ఫోన్లు: వినడానికి కొంత అతిశయోక్తిగా ఉన్నా, మరో పదేళ్లలో స్మార్ట్ ఫోన్లు అంతరించి పోవచ్చని అంచనా. వీటి స్థానంలో గ్లాస్ ఆధారిత స్క్రీన్లు మీ ఆఫీస్ టేబుల్ పై, గోడలపై, ఇండ్లలో ఉండవచ్చు. మీకు సంబంధించిన సమస్త సమాచారం ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇక ఫోన్ కాల్స్ కోసం వైర్ లెస్ ఇయర్ బడ్స్ వస్తాయి. ప్లాస్టిక్ మనీ: ఆర్థిక లావాదేవీల్లో ఇప్పుడు అత్యంత కీలకంగా ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులు మాయం కావచ్చు. వీటి స్థానంలో ఐరిస్ కీలకం అవుతుంది. ఏదైనా ఆన్ లైన్లో ఆర్డర్ చేయడం, తెచ్చుకోవడమే జరుగుతుంది. డబ్బులు తీసుకోవాలన్నా, కంటిని చూపించి ఏటీఎం సెంటర్ నుంచి తెచ్చుకోవచ్చు. పెరిగిపోతున్న కార్డుల అక్రమాలకు చెక్ చెప్పేందుకు ఈ విధానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. వాల్ మౌంటెడ్ టీవీలు: ప్రస్తుతం రాజ్యమేలుతున్న ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు కూడా మరో పదేళ్లలో మాయం కావచ్చు. వీటి స్థానంలో మిర్రర్ ఫినిష్డ్ డిస్ ప్లేలు వస్తాయి. ఇప్పటికే ఈ తరహా టీవీలు కొన్ని మార్కెట్లోకి వచ్చినా, పూర్తి స్థాయి అందుబాటులోకి రాలేదు. ఉత్పాదన పెరిగి ధర దిగివస్తే, కేవలం రెండు సెంటీమీటర్ల మందంతో టీవీలు వచ్చేస్తాయి. రిమోట్ కంట్రోల్స్: టీవీల నుంచి ఎయిర్ కండిషనర్ల వరకూ దూరంగా ఉండి నియంత్రించేందుకు సహకరిస్తున్న రిమోట్ కంట్రోల్స్ కూడా అంతరించి పోతున్నాయి. వీటి స్థానంలో వాయిస్, గెస్చర్ విధానాల్లో నియంత్రణ సులువవుతుంది. ఇంట్లో మనిషి కాలు పెట్టగానే గుర్తించి ఏసీ ఆన్ కావడం, ఫలానా చానల్ కావాలంటే అది వచ్చేయడం జరిగిపోతుంది. మోషన్ సెన్సార్లది కీలక పాత్రగా మారి రిమోట్ మూలన పడుతుంది. కార్డ్ లెస్ ల్యాండ్ లైన్: ఇప్పటికే వీటి వినియోగం భాగా తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇంట్లో అక్కడక్కడా ఏర్పాటు చేసే మైక్రో ఫోన్స్, స్పీకర్ల ద్వారా తిరుగుతూ కార్డ్ లెస్ ఫోన్, చేతిలో సెల్ ఫోన్ లేకుండానే మాట్లాడుకునే సౌలభ్యం దగ్గర కానుంది. ల్యాప్ టాప్ లు: ల్యాప్ టాప్ ల స్థానంలో వర్చ్యువల్ కీ బోర్డులు రాజ్యమేలుతాయి. టేబుల్ పైనే అక్షరాలు ఉన్నాయని భావిస్తూ టైప్ చేస్తుంటే అదే టేబుల్ ఉపరితలమే స్క్రీన్ గా కూడా పనిచేసే సాంకేతికత అందుబాటులోకి రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇక కంప్యూటర్లదీ ఇదే పరిస్థితి. ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్: గిగాబైట్ల సమాచారం చిన్న చిన్న చిప్ లలో ఇమిడిపోతున్న వేళ, భారీగా ఉండే ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్ లు కనుమరుగై పోనున్నాయి. దీంతో పాటు సమాచారమంతా క్లౌడ్ విధానంలో దాచుకుంటూ ఉండటం కూడా హార్డ్ డ్రైవ్ ల అవసరాన్ని తగ్గిస్తోంది.

More Telugu News