: దసరా-దీపావళి గిఫ్ట్... గృహ, వాహన రుణాలు తగ్గుతాయి: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారత ప్రజలకు దసరా - దీపావళి పండగ సీజన్ బహుమతి లభించింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కస్టమర్లకు లబ్ధిని చేకూర్చడంతో పాటు మరింత తక్కువ రేట్లకు నూతన రుణాల లభ్యతను పెంచే లక్ష్యంతో రెపో రేటును పావు శాతం మేరకు తగ్గించినట్టు ఆర్బీఐ నూతన గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యానించారు. రెపో రేటును తగ్గించాలని ఆరుగురు సభ్యుల పరపతి సమీక్ష కమిటీ ఏకగ్రీవంగా రేట్ కట్ కు ఓటేసిందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న సంక్షోభ పరిణామాల నుంచి సులువుగా, వేగంగా బయటపడేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణంతో పాటు సంతృప్తికరంగా ఉన్న రుతుపవనాలు, పంట దిగుబడి పెరగనుందన్న అంచనాలు తమ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెంటనే రుణ తగ్గింపు చర్యలు చేపట్టి కస్టమర్లకు మరింత వెసులుబాటు కల్పించాలని ఉర్జిత్ సూచించారు. జూలైలో పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయల ధరలు గరిష్ఠస్థాయికి చేరాయని గుర్తు చేసిన ఆయన, ఆపై ధరలు తగ్గుతూ వచ్చాయని తెలిపారు. సమీప భవిష్యత్తులో సైతం వీటి ధరలు స్థిరంగా ఉంటాయనే ఊహిస్తున్నట్టు వివరించారు. వచ్చే సంవత్సరం నుంచి అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను, దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచనుందని, మరిన్ని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్స్ వచ్చే వేళ, ఇండియాలోనూ తక్కువ వడ్డీకి రుణాలు లభించాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు.

More Telugu News