: తరంగాల వేలం... కేంద్ర ఖజానాకు రూ. 56 వేల కోట్లు ఖాయం

స్పెక్ట్రమ్ వాయు తరంగాల వేలం రెండో రోజున రూ. 56,872 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. తొలి రోజున రూ. 53,531 కోట్ల విలువైన తరంగాలకు బిడ్లు రాగా, రెండో రోజున వేలంలో ధర మరో రూ. 3,300 కోట్లు పెరిగింది. ముఖ్యంగా అన్ని టెలికం సంస్థలూ అధికంగా వినియోగించే 1800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ కోసం డిమాండ్ అధికంగా ఉందని తెలుస్తోంది. 700, 900 మెగాహెర్జ్ బ్యాండ్ పై తరంగాలు తీసుకునేందుకు ఏ టెల్కో కూడా ఆసక్తి చూపడం లేదు. తొలి రోజున ఆరు రౌండ్లు, రెండో రోజున మరో 5 రౌండ్ల వేలం జరుగగా, ముంబై, యూపీ ఈస్ట్ మరియు వెస్ట్, గుజరాత్ సర్కిళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 700, 900 మెగా హెర్జ్ స్పెక్ట్రమ్ ధర అధికంగా ఉండటంతోనే బిడ్డర్లు వేలంలో పాల్గొనడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2జీ నుంచి 4 జీ వరకూ ఏ సేవలనైనా 1800 మెగాహెర్జ్ పై అందించే అవకాశాలు ఉండటంతో దీని వెనుకే అన్ని టెల్కోలు పడుతున్నాయి. కాగా, బీహార్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రల్లో 2300 మెగాహెర్జ్ బ్యాండ్ తరంగాలకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. ఢిల్లీ, బీహార్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో 3జీ సేవలను మరింత సమర్థవంతంగా అందించే 2100 మెగాహెర్జ్ కోసం టెలికంల మధ్య పోటీ సాగుతోంది.

More Telugu News