: పెరిగిన వాహన అమ్మకాలు, ఆర్బీఐ సమీక్ష నేపథ్యంలో మార్కెట్ బుల్ హైజంప్

ఓ వైపు సెప్టెంబర్ నెలలో గణనీయంగా పెరిగిన అమ్మకాలు వాహన రంగంలోని కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు డిమాండ్ వెల్లువెత్తగా, రేపు జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్షలో మార్కెట్ వర్గాలను మెప్పించే నిర్ణయం ఉండవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ బుల్ హైజంప్ చేసింది. అత్యంత కీలకమైన 28 వేల పాయింట్ల స్థాయిని సెన్సెక్స్, 8,700 మద్దతు స్థాయిని నిఫ్టీ అధిగమించి ముందుకు దూసుకెళ్లాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఆటో, బ్యాంకింగ్ రంగంలోని ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. లార్జ్ క్యాప్ లతో పోలిస్తే, స్మాల్, మిడ్ క్యాప్ సెక్టార్లు రెట్టింపు లాభాలను సాధించాయి. దీంతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1.12 కోట్లను దాటి పరుగులు తీసింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 377.33 పాయింట్లు పెరిగి, 1.35 శాతం లాభంతో 28,243.29 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 126.95 పాయింట్లు పెరిగి 1.47 శాతం లాభంతో 8,738.10 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 2.40 శాతం, స్మాల్ కాప్ 2.67 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 48 కంపెనీలు లాభపడ్డాయి. జడ్ఈఈఎల్, ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి, హీరో మోటో కార్ప్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, టీసీఎస్, ఇన్ ఫ్రాటెల్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 3,005 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 2,226 కంపెనీలు లాభాలను, 661 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,12,93.400 కోట్లకు పెరిగింది.

More Telugu News