: తాజ్ గ్రూప్ దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్ వేసిన మారియట్

భారత ఆతిథ్య రంగంలో తొలిసారిగా ఓ విదేశీ సంస్థ ఆధిపత్యం మొదలైంది. దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న తాజ్ గ్రూప్ ను మారియట్ గ్రూప్ అధిగమించింది. అమెరికన్ హోటల్ చైన్ స్టార్ వుడ్ ను సొంతం చేసుకున్న తరువాత మారియట్ గదుల సంఖ్య తాజ్ హోటల్స్ నిర్వహణలోని మొత్తం గదుల సంఖ్యను దాటింది. డిసెంబర్ 1999న గోవాలో మారియట్ రిసార్ట్స్ పేరిట భారత్ లో కాలుమోపిన సంస్థ నిర్వహణలో ఇప్పుడు 18 వేలకు పైగా రూమ్స్ ఉండగా, తాజ్ గ్రూప్ లోని అన్ని హోటల్స్ లోని రూమ్స్ సంఖ్య 14 వేలు మాత్రమే. భారత అతిథులకు మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు స్టార్ వుడ్ విలీనం సహకరిస్తుందని మారియట్ ఆసియా పసిఫిక్ హెడ్ రాజీవ్ మీనన్ వెల్లడించారు. కాగా, రూముల సంఖ్య పరంగా మారియట్ ముందున్నప్పటికీ, హోటల్స్ సంఖ్య పరంగా మాత్రం వెనకే ఉంది. తాజ్ గ్రూప్ అధీనంలో దేశవ్యాప్తంగా 108 హోటల్స్ ఉండగా, మారియట్ చేతుల్లో ఉన్నది 79 మాత్రమే.

More Telugu News