: పాకిస్థాన్ ఎగుమతి చేసే బియ్యంలో అత్యంత వినాశకారి తెగులు గుర్తింపు!

అమెరికాకు పాకిస్థాన్ ఎగుమతి చేసే బియ్యంలో అత్యంత వినాశకారి తెగులు ఖప్రా బిటీల్ ను గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత వినాశకారి తెగులు అయిన దీనికి ‘డర్టీ ఫీడర్’ అనే పేరు కూడా ఉంది. ఈ తెగులు తాను తినే దానికన్నా కూడా ఎక్కువ మొత్తంలో ధాన్యానికి నష్టం కలిగిస్తుంటుంది. అందుకనే, ‘డర్టీ ఫీడర్’ అనే పేరు కూడా స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన పాకిస్థాన్ నుంచి వర్జీనియాలోని నార్ ఫ్లోక్ ఓడరేవుకు కంటైనర్ లో వచ్చిన బియ్యంలో ఖప్రా బిటీల్ కీటకం లార్వా చర్మం ఉన్నట్లు అమెరికా కస్టమ్స్, బార్డర్ విభాగానికి చెందిన నిపుణులు గుర్తించారు. కంటైనర్ కు, బియ్యానికి మధ్య ఉన్న ప్లాస్టిక్ లైనింగ్ లో నాలుగు లార్వా చర్మాలుండటాన్ని వారు గుర్తించారు. కాగా, ఈ విధంగా జరగడం ఈ ఏడాదిలో రెండోసారి. కిందటేడు కూడా మూడుసార్లు లార్వా చర్మాలుండటాన్ని అధికారులు గుర్తించారు. ‘ఖప్రా బీటిల్’ కారణంగా జంతువులకు, మానవులకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News