: పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర నిరసన.. అసెంబ్లీలోనే తిండి, నిద్ర!

పంజాబ్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన తారస్థాయికి చేరింది. అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంపై నిన్నటి అసెంబ్లీ సమావేశంలో వారు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే, సభ వాయిదాపడ్డ అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. ఈ అంశంపై మళ్లీ కొత్తగా చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ హాల్ ను ఖాళీ చేసి వెళ్లాలని సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కోరినప్పటికీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. వారి నిరసనను కొనసాగించారు. అసెంబ్లీ హాల్ లో నేలపైనే పడుకున్నారు. ఈరోజు ఉదయం అక్కడే బ్రష్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చరణ్ జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, అసెంబ్లీ అధికారులు మొత్తం లైట్లు, ఏసీలు ఆపేశారని, తమకు చాలా సేపటి వరకు కనీసం తిండి, నీళ్లు కూడా లేవని చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అసెంబ్లీ సిబ్బంది కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. తమ సెల్ ఫోన్లను ఆన్ చేసుకుని, ఆ లైటింగ్ లోనే తాము ఉన్నామని చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్లిపోయినా, యువ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఆగిపోయారన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న మొత్తం 27 మంది ఎమ్మెల్యేలకు పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ కేఎఫ్ సీ నుంచి ఆహారం పంపారని చెప్పారు. కాగా, ఈ ఏడాదిలో జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశం ఇదే. ఈరోజు బక్రీద్ సెలవు కాగా, రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వచ్చే ఏడాదిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పన్నిన వ్యూహంలో భాగంగానే ఈ తరహా నిరసనకు దిగిందని విమర్శకులు అంటున్నారు.

More Telugu News