: 'లంచం'పై ట్వీట్ చేసిన కపిల్ శర్మపై రెండు కేసులు!

హిందీ బుల్లితెర స్టార్ కపిల్ శర్మ ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ అతనిపై రెండు కేసులు నమోదయ్యేలా చేసింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి తనను 5 లక్షల రూపాయలు లంచం అడిగారని, అచ్ఛాదిన్ అంటే ఇదేనా? అని ప్రధానిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. వెంటనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అనంతరం అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఎక్కడి నుంచో వచ్చి ముంబై పరువు తీస్తున్నాడంటూ అతనిపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) మండిపడింది. తాజాగా ఎంఎన్‌ఎస్‌ పార్టీ కపిల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవినీతిపై ఆరోపణలు చేసిన కపిల్‌ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ఆ పార్టీ నేత సందీప్‌ దేశ్‌ పాండే ప్రశ్నిస్తున్నారు. దీంతో వెర్సోవా పోలీస్‌ స్టేషన్ లో కపిల్‌ శర్మపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాధికారులు లంచం అడగడం నేరమని తెలిపిన పాండే, దానిపై కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా చేయకుండా ఉండడం కూడా నేరమని స్పష్టం చేశారు. ఈ కేసులో కపిల్‌ బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని, అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. మరోవైపు కపిల్‌ శర్మ తన భవనాల నిర్మాణంలో నియమాలను ఉల్లంఘించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ అదే పార్టీ జనరల్‌ సెక్రటరీ శాలిని ఠాక్రే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కపిల్ చేసిన ఒక్క ట్వీట్ అతనికి రెండు కేసులను తెచ్చిపెట్టింది. అయితే ఈ కేసులపై కపిల్ మౌనం వహించడం విశేషం.

More Telugu News