: సినిమాలకు, రాజకీయాలకు ఉన్న ప్రాముఖ్యత మిగతా వాటికి ఇవ్వడం లేదు: వెంకయ్యనాయుడు

మన వ్యవస్థలో సినిమాలకు, రాజకీయాలకు ఉన్న ప్రాముఖ్యత మిగతా వాటికి ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయ మాసపత్రిక ‘రైతు నేస్తం’ 12వ వార్షికోత్సవం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెన్సేషనల్ న్యూస్ తో పాటు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన వ్యవసాయంపై కూడా మీడియా దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయ రంగానికి లభించాల్సిన ప్రాధాన్యత లభించడం లేదని, స్వామినాథన్ సిఫారసులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి గుర్తింపు లేదు, ప్రచారం లేదు, ప్రసారం లేదని, వ్యవసాయంలో గ్రామర్ ఉంది, కానీ, గ్లామర్ లేదని అన్నారు. అన్ని పత్రికలు కూడా వ్యవసాయానికి తగినంత సమయాన్ని, తగినంత స్థలాన్ని కేటాయించాలని, వ్యవసాయ వార్తలను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం, డాక్టరు ఐవి సుబ్బారావు పేరిట 51 మందికి రైతునేస్తం పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News